Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:54 pm Posted by : ramakrishna

పసి పిల్లల మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలను తగ్గించేందుకు వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలపై సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల్లో ప్రమాదకర లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని, ప్రతి బాలింతను ఇంటి వద్ద క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలని ఆమె తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యత, ముఖ్యంగా ప్రసవం జరిగిన గంటలోపే మొట్టమొదటి తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సీపీఆర్‌పై ప్రతి ఆరోగ్య కార్యకర్తకు అవగాహన ఉండాలని, మదర్ ఇన్ – మదర్ అవుట్ సమాచార మార్పిడి ద్వారా ఫాలోఅప్ సేవలు సమర్థవంతంగా నిర్వహించి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రథమ చికిత్స కిట్లు, ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించి, పిల్లల మధ్య కనీసం మూడు సంవత్సరాల వ్యవధి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ఐయూడీ, పీపీ ఐయూడీ, అంతర ఇంజెక్షన్ వంటి తాత్కాలిక పద్ధతులతో పాటు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులపై కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. గత రెండేళ్ల ప్రసవాల రికార్డుల ఆధారంగా జాబితాలు తయారు చేసి లక్ష్యిత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నవీన్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల మరణాలు నెలకు పది లోపు ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గర్భిణీల బరువు పెరుగుదలను ప్రతి నెలా సమీక్షించడంతో పాటు, ప్రసవానంతరం ఏడో నెల నుంచి శిశువులకు అనుబంధ ఆహారం అందించే విషయంపై బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఉమా, డాక్టర్ వనిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సీబీపీ, హిమోగ్లోబిన్, రక్తపోటు, ఎత్తు, బరువు పరీక్షలు నిర్వహించి కనీసం నాలుగు సార్లు వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని తెలిపారు. ప్రమాదకర గర్భిణీలను ముందుగానే గుర్తించి ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల నిర్వహణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ తదితర విభాగాల సహకారం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఐఓ డాక్టర్ ఎం. అశోక్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ రవీందర్, డాక్టర్ సమత, పీఓ ఎంసీహెచ్ డాక్టర్ శిఖర, సీడీపీఓలు, డీహెచ్ఈ లు, వివిధ పీహెచ్‌సీల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Special measures should be taken to reduce infant mortality.