Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 7:52 pm Posted by : ramakrishna

నగర పాలక సంస్థలో సానిటేషన్ ను చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్

 

. . . మురుగు కాలువల్లో ముందస్తుగానే పూడికతీత పనులు

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 70 లక్షలను వెచ్చిస్తూ మురుగు కాలువల్లో ముందస్తుగానే పూడికతీత పనులు జరిపిస్తున్నామని అన్నారు. ఈ పనుల ప్రగతిపై సోమవారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్లో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభమైన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఇప్పటివరకు 36 డివిజన్లలో పూర్తయ్యిందని, మరో 24 డివిజన్లలో చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. 01, 17, 39, 40, 43, 6, 7, 22, 23, 24, 45, 52, 56, 58, 59, 21, 34, 18, 10, 11, 13, 14, 31, 32 డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి రోజు రెండు నుండి మూడు డివిజన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ జరుగుతోందని, నగర మేయర్, కార్పొరేటర్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములవుతున్నారని, సర్కిల్ పరిధిలోని సానిటేషన్ కార్మికులు అందరూ పారిశుధ్య పనులను చేపడుతుండడం వల్ల ఆయా డివిజన్లలో సానిటేషన్ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను తరలించడం, పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతున్నారని అన్నారు.

 

Special drive to improve sanitation in the municipal corporation.

 

ఇదే స్పూర్తితో మిగితా డివిజన్లలో కూడా ప్రణాళికాబద్దంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన జరిపిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 70 లక్షల నిధులను వెచ్చిస్తున్నామని వెల్లడించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు జలాలతో చెత్తాచెదారం మురుగు కాలువల్లోకి చేరి, పూడిక వల్ల ముందుకు వెళ్లే అవకాశం లేక నగరంలోని పలు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయంగా మారే అవకాశం ఉన్నందున డీసిల్టింగ్ పనులు చేయిస్తున్నామని అన్నారు. అవకాశం ఉన్న చోట జేసీబీల ద్వారా, మిగితా చోట్ల పారిశుధ్య కార్మికులతో పూడికతీత పనులు చేయిస్తున్నామని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమవంతు సహకారం అందిస్తూ, అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

 

Special drive to improve sanitation in the municipal corporation.