Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2024, 5:08 pm Posted by : ramakrishna

న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి

  • బార్ అసోసియేషన్అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్
  • రెండోరోజు కొనసాగిన న్యాయవాదుల ఆందోళన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీమ్ పై మదన్నపేట్ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రెండవ రోజు ఆందోళన కొనసాగింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లాకోర్టు చౌరస్తాకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పోలీసుల చట్టవ్యతిరేకమైన చర్యలను ఏకరువుపెట్టారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ  ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి, న్యాయవాదుల ప్రాణాలకు ఎసరుపెట్టే పోలీసింగ్ తయారు అయిందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లలో న్యాయవాదుల కోర్టుల విధుల బహిష్కరణ కొనసాగిందని వెల్లడించారు. శాంతిభద్రతలు ,శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కొందరు పోలీసుల మూలంగా అపఖ్యాతి మూటగట్టుకోవాల్సి రావడం దృరదృష్టకరమని తెలిపారు. పోలీసు శాఖ లో రాక్షస మనస్తత్వం ఉన్న, పౌరుల హక్కులను గుర్తించని వారిని పోలీసు ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించాలని  డిమాండ్ చేశారు.పోలీసు ఉన్నతాధికారులు మాదన్నపేట్ నేరమయ ఘటనకు భాద్యులైన పోలీసులపై డిజిపి కి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇంతవరకు స్పందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని అన్నారు. తక్షణమే బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్న దృశ్య న్యాయవాద వృత్తి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి దొన్పాల్ సురేష్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్,కోశాధికారి దీపక్ న్యాయవాదులు అపూర్వ,మానిక్ రాజు,ఆశా నారాయణ,అన్వేష్,సృజన్, విజయ్ సామ్రాట్ మధుసూదన్ గౌడ్ విశ్వాక్ సేన్ మధు చుక్కబొట్లరాజు ప్రకాష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు