- మాణిక్ బండార్ వెంచర్ కు భూములు అమ్మిన రైతులకు తప్పని వెతలు
- మిగులు భూములకు వెళితే బెదిరింపులు
- ఆనాడు బీఆర్ఎస్ పెద్ధల అండతో రెచ్చిపోయిన రియాల్టర్ లు
- ప్రస్తుతం సీయం పేషీ మొదలుకొని ప్రజా వాణిలో ఫిర్యాదులు
నిజామాబాద్, బతుకమ్మ :
వెంచర్ ఏర్పాటుతో భూముల ధరలు పెరగడంతో తమకున్న కొద్దీ పాటి భూమిని అమ్ముకున్నారు ఆ రైతులు.. తీరా అమ్ముకున్న భూములకు డబ్బులు ఇవ్వాల్సిన వెంచర్ నిర్వాహకులు డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగడంతో లబోదిబోమంటున్నారు ఆ రైతులు.. భూములు అమ్మి మోస పోయామని ఆందోళనలతో ఒకరు ప్రాణాలు కోల్పోగా. పలువురు మంచానికే పరిమితం అయ్యారు.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు..

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్ బండార్ శివారులో 4 సంవత్సరాల క్రితం గండ్రా ప్రాజెక్ట్ పేరుతో ఒక వెంచర్ ఏర్పాటు అయింది. ఈ వెంచర్ కోసం రైతుల వద్ద నుండి భూమిని సేకరించారు వెంచర్ నిర్వాహకులు. మొత్తం 216 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ కోసం మానిక్ బండార్, గూపన్ పల్లి గ్రామాల రైతుల వద్ద భూములు కొనుగోలు చేసిన నిర్వాహకులు చాలా మంది రైతులకు మొత్తం డబ్బులు చెల్లించలేదు. కొంత పలుకుబడి ఉన్న రైతులకు డబ్బులిచ్చిన వెంచర్ యజమానులు… చిన్న సన్న కారు రైతుల భూములకు నయానో భయానో ఇచ్చి కబ్జా చేశారు. ఎకరం భూమి కొంటె అరేకరానికి.. అరేకరం కొంటె కొన్ని గుంటలు భూమికి డబ్బులిచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. డబ్బుల కోసం తిరిగిన రైతులను బెదిరించడం, తమ మనుషులతో కొట్టించటం లాంటివి చేసారని ఆరోపిస్తున్నారు రైతులు.

మానిక్ బండార్ లో ఏర్పాటు చేసిన వెంచర్ కోసం భూములిచ్చిన రైతులు సర్వం కోల్పోయారు. మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకు భూములిచ్చిన రైతులకు ఒప్పందం చేసుకున్న డబ్బులు కూడా ఇవ్వలేదు వెంచర్ యజమానులు. మానిక్ బండార్ గ్రామానికి చెందిన సుంకరి లక్ష్మణ్ అనే రైతుకు వెంచర్ ఏర్పాటైన ప్రాంతంలో 554 సర్వేనంబర్ లో 28 గుంటలు వ్యవసాయ భూమి ఉండేది. వెంచర్ కోసం భూమిని అమ్మిన లక్ష్మణ్ నుండి 11 గుంటలు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు ఇచ్చారు. మిగితా 13 గుంటల భూమిని కబ్జా చేసుకుని అదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో చూపి.. భూమిని కలిపేసుకున్నారు వెంచర్ నిర్వాహకులు. 11 గుంటలు భూమి పోగా మిగితా భూమిలో ఎప్పటిలాగే సాగు కోసం వెళ్లిన లక్ష్మణ్ కుటుంబాన్ని బెదిరించారు వెంచర్ నిర్వాహకులు. మొత్తం భూమిని తమకే అమ్మాడు ఇంకా భూమి ఎక్కడిదని, ఇంకోసారి ఇక్కడికి వస్తే బాగోదని బెదిరించారు. దీంతో ఆందోళన చెందిన లక్ష్మణ్ పలు మార్లు వెంచర్ యజమానుల చుట్టూ తిరిగాడు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసారు.. అయినా లాభం లేకలేకపోయింది. వెంచర్ యజమానులు తమ పలుకుబడిని ఉపయోగించి పోలీసులు, గుండాలతో బెదిరించటంతో మనస్తాపం చెందాడు. పక్షవాతానికి గురై మంచాన పడ్డాడు. భూమి అమ్మిన పాపానికి తన భర్త, మా నాన్న పక్షవాతం బారిన పడ్డాడని ఇప్పుడు మందుల కోసం కూడా డబ్బులు లేవని వాపోతున్నారు ఆ కుటుంబ సభ్యులు.

ఇక గండ్రా ప్రాజెక్ట్ కోసం భూమిని అమ్మిన మానిక్ బండార్ కు చెందిన మరో రైతు ఎరుకల గంగారాం వెంచర్ నిర్వాహకులు బెదిరించడం, దాడి చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మానిక్ బండార్ కు చెందిన ఎరుకుల గంగారంకు సర్వే నంబర్ 413, 560/ఆ లో ఏకారంన్నర భూమి ఉంది. వెంచర్ కోసం ఎకరం భూమిని అమ్మాడు సదరు రైతు గంగారాం. ఎకరం భూమికి డబ్బులిచ్చిన వెంచర్ యజమానులు మొత్తం భూమిని రిజిస్టేషన్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గంగారాం వెంచర్ నిర్వహకులను నిలదీశాడు. అయితే వెంచర్ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించటంతో పాటు చేయి చేసుకున్నారు. దీంతో ఆవేదన చెందిన గంగారాం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబం రోడ్డున పడింది.

గండ్రా వెంచర్ ఏర్పాటు నుండి వివాదాస్పదంగా ఉంది. వెంచర్ లో జరిగిన అక్రమాల మీద చాలా ఫిర్యాదులున్నాయి. అయితే అప్పటి బీఆరెస్ పెద్దలు ఈ వెంచర్ లో భాగస్వాములు కావటంతో బాధితులు భయపడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రజావాణితో పాటు, సీఎం పేషీకి కూడా పలువురు ఫిర్యాదు చేసారు. వెంచర్ ముసుగులో ప్రభుత్వ భూములు కబ్జా చేసిన నిర్వాహకులు రైతులను కూడా మోసం చేసారు. తవ్వినకొద్ది అక్రమాలు వెలుగు చూస్తుండటంతో వెంచర్ లో ప్లాట్లు కొన్న కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకునిరెత్తినట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సినీ ఫక్కీలో బెదిరింపులు, కబ్జాలు చేసి వెంచర్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఇప్పుడు వరుసగా ఫిర్యాదులు, విమర్శలు వస్తుండటంతో అధికార పార్టీ నేతల చుట్టూ తిరిగుతున్నట్లు సమాచారం.