Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:48 pm Posted by : ramakrishna

ఎల్లయ్య చెరువులో మట్టి మాఫియా దందా

 

. . . చర్యలు తీసుకోని అధికారులపై ప్రతిపక్ష కౌన్సిలర్ల ఆగ్రహం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ రవాణాపై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు ఎనిమిది రోజులుగా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెరువులో నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ వెంచర్లు, ప్లాట్ల అభివృద్ధి పనులు మరియు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎమ్మార్వో నుంచి జిల్లా కలెక్టర్ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు బహిరంగ సభల్లో “ఎక్కడ అన్యాయం జరిగినా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి, తప్పు చేసిన వారు అధికార పార్టీకి చెందిన వారైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా కఠిన చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీలు అమలు కావడం లేదని, అధికార పార్టీ నేతల మట్టి మాఫియాపై అధికారులు కనీస స్పందన కూడా చూపకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. న్యాయం కోసం అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో “న్యాయం ఎక్కడ దొరుకుతుందో” అని వెతుకుతున్న పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్ష కౌన్సిలర్లే ఎల్లయ్య చెరువుకు న్యాయం చేస్తామని వారు ప్రెస్‌మీట్ ద్వారా అధికారులను హెచ్చరించారు.