Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 8:29 pm Posted by : ramakrishna

జేఈఈ అడ్వాన్స్‌ డ్‌లో సత్తా చాటిన సాంఘిక సంక్షేమ గురుకులాలు

 

. . . 163 మందికి ఐఐటీ లో అవకాశం

 

. . . జేఈఈ మెయిన్స్‌ లో 358 మంది అర్హత

 

. . . సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాసంస్థలు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జేఇఇ అడ్వాన్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మాట్లాడుతూ… జేఈఈ మెయిన్స్–2026, జేఈఈ అడ్వాన్స్‌ డ్–2026 పరీక్షల్లో గురుకుల విద్యార్థులు సాధించిన ఫలితాలు నాణ్యమైన ప్రభుత్వ విద్యకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. సొసైటీ పరిధిలోని 37 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థల్లో సైన్స్, ఆర్ట్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఓఈలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు.

 

Social welfare gurukuls that excelled in JEE Advanced

 

జేఈఈ మెయిన్స్ – 2026 పరీక్షకు మొత్తం 355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 61 మంది విద్యార్థులు డైరెక్ట్ ఐఐటి లో సీటు లో పొందారు. 102 మంది ప్రిపరేటరీ ర్యాంకులు సాధించి మొత్తం 163 మంది ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. అదే విధంగా దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2026లో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. కమ్యూనిటీ ర్యాంకుల్లోనూ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. 500 లోపు ఒకరు, 1000 లోపు ముగ్గురు, 2000 లోపు 14 మంది, 3000 లోపు 25 మంది, 5000 లోపు 39 మంది విద్యార్థులు కమ్యూనిటీ ర్యాంకులు సాధించి జాతీయ స్థాయిలో తమ సత్తాను నిరూపించారు. చిలుకూరు బాయ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ కు చెందిన పి.హేమంత్ ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా కమ్యూనిటీ ర్యాంక్ – 200 సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. గౌలిదొడ్డి బాయ్స్ సీఓఈకి చెందిన సత్య స్వరూప్ (ఈడబ్ల్యూఎస్–741), వైభవ్ ప్రసాద్ (ఎస్టీ–984), తనీష్ (ఎస్సీ–1077), శిరీష (ఎస్టీ–1298), సాయిరాం (ఎస్సీ–1456), ప్రియాంక (ఎస్టీ–1509), వి.మంజుల (ఎస్సీ–1628), డి.దివ్య (ఎస్టీ–1696), ఎస్.సందీప్ (ఎస్సీ–1706), పరమాండ్ల మనస్విత్ (ఎస్సీ–1829), డి.శ్రీశాంత్ (ఎస్టీ–1881), కె.శ్రీవర్ష (ఎస్సీ–1907), డి.అక్షయ (ఎస్సీ–2054), ఎస్.పూజ (ఎస్టీ–2197), కె.ఉదయ్ (ఎస్టీ–2313), జయసింధూర (ఎస్సీ–2423), ఏ.అభినవ్ (ఎస్టీ–2431), జె.నవీన్ (ఎస్సీ–2521) తదితరులు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

 

Social welfare gurukuls that excelled in JEE Advanced

 

ఈ సందర్భంగా టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి విజయేంద్ర బోయి మాట్లాడుతూ… గురుకుల విద్యాసంస్థలపై తల్లిదండ్రులు ఉంచుతున్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి లక్ష్యబద్ధమైన శిక్షణ, నిరంతర పరీక్షలు, వ్యక్తిగత అకాడమిక్ మెంటరింగ్, ప్రత్యేక ఐఐటీ-జేఈఈ కోచింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని విద్య ద్వారా సాకారం చేసే దిశగా కృషి చేస్తోందన్నారు. “పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని గురుకుల విద్యార్థులు మరోసారి నిరూపించారు. గ్రామీణ ప్రాంతాలు, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించడం తెలంగాణకు గర్వకారణం. గురుకుల విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎయిమ్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల్లో రాణించేలా ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది” అని మంత్రి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా గురుకుల విద్యాసంస్థల్లో అకాడమిక్ ప్రమాణాల పెంపు, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, విద్యార్థుల మానసిక దృఢత్వం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలు ఫలితాల రూపంలో ప్రతిఫలిస్తున్నాయని ఆయన తెలిపారు.

 

Social welfare gurukuls that excelled in JEE Advanced