Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 7:22 pm Posted by : ramakrishna

మిట్టాపల్లిలో మున్నూరు కాపు కుటుంబాల సాంఘిక బహిష్కరణ

  • 10 నెలలుగా వీడీసీ దౌర్జన్యం
  • స్థానిక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
  • అదనపు కలెక్టర్ కు  బాధితుల ఫిర్యాదు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని మిట్టాపల్లికి చెందిన 8 మున్నూరు కాపు కుటుంబాలను గ్రామాబివృద్ది కమిటీ అకారణంగా సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధిత కుటుంబాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన  గ్రామాబివృద్ది కమిటీ సభ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. గత యేడాది సెంబర్ 15న గణేష్ నిమజ్జనం సందర్భంగా తంగేళ్ళ కిషన్, మాసిపెద్ది శ్రీనివాస్ ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత మాజీ ఎంపీపీ,  కాంగ్రెస్ నాయకుడు మిట్టాపల్లి గ్రామానికి చెందిన కంచెట్టి గంగాధర్ అండతో వీడీసీ సభ్యులు మున్నూరు కాపు కులానికి సంబంధించిన 8 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారని వాపోయారు. మా కుటుంబాల్లో జరిగే ఎలాంటి కార్యక్రమాలకు గ్రామంలోని ఇతర కులాల వారు హాజరుకావద్దని, ఎలాంటి సహకారం అందించవద్దని నిర్ణయించారన్నారు. ఈ మేరకు అన్ని కులాల వారికి వీడీసీ తరపున తీర్మాణాన్ని అందించారని బాధితులు తెలిపారు. దీంతో మేము గత పది నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డిచ్ పల్లి సిఐ మల్లేష్, ఎస్సై షరీఫ్ ను సంప్రదించినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషర్ లు తమకు న్యాయం చేయాలని కోరారు. సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులు తేలు గణేష్ (మాజీ సర్పంచ్), మాసిపెద్ది శ్రీనివాస్, తేలు గంగాధర్, మాసిపెద్ది రవి, ఒడ్డం నర్సయ్య, గోపు రాజేశ్వర్, చిత్తపేట నడిపి గంగారాం, గోపు చరణ్ లు ఉన్నారు.