Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2025, 8:02 pm Posted by : ramakrishna

ఆరు గ్యారెంటీలే పెద్ద డ్రామా

  • ప్రజలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ
  • మళ్లీ ఓట్ల కోసం గ్రామాలకొచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలి
  • మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన  ఆరు గ్యారెంటీలే పెద్ద డ్రామా అని మాజీ ఎమ్మెల్యే,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.  గద్దెనెక్కగానే మాట మార్చి  ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చే ఎన్నికల హామీలు ఒక నాటకమని  ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు పచ్చి బూటకమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో ఓట్ల కోసం కాంగ్రెస్ పాట్లు పడుతోందని,మరోమారు ప్రజలను ఏమార్చ డానికి  పగటి వేషాలు వేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్  అంటేనే అవినీతి గని,దేశానికి పట్టిన శని అని ఆయన అన్నారు. నమ్మి ఓటేసిన చేతినే కాటేసే కాలనాగు కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. మళ్లీ ఓట్ల కోసం గ్రామాలకొచ్చే కాంగ్రెస్ నేతలను నిలేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని తిరగబడాలని,గ్రామ పొలిమేరలు దాటే వరకూ తరిమి కొట్టాలన్నారు. గ్రామ సభలల్లో హామీల గురించి ప్రశ్నించిన రైతులను పోలీసులతో,కాంగ్రెస్ గుండాలతో కొట్టిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని ఆరోపించారు. అందరి జాతకాలు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామని,వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ను స్థానిక ఎన్నికల్లో నిలదీయాలన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కామాను చెడిపేసి ఫుల్ స్టాఫ్ ఎందుకు పెట్టారో బీసీ కాంగ్రెస్ నేతలపై తిరగ బడాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరులో కాంగ్రెస్ జీరో కావడం ఖాయమన్నారు.ఈ విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ దండు నీతూకిరణ్,మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు,నగర అధ్యక్షులు సిర్ప  రాజు తదితరులున్నారు.