Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 1:35 pm Posted by : ramakrishna

ఇద్దరు యువకులను చితకబాదిన ఎస్సైలు

. వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆపకుండా వెళ్లారని ఆగ్రహం

. జారి పడ్డారని చెబుతున్న ఖాకీలు

. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

. నేషనల్ హైవే 44పై ఘటన..

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: వాహనాలను తనిఖీ చేస్తుండగా వాహనం ఆపకుండా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువకులను ఎస్సైలు చితకబాదిన ఘటన జాతీయ రహదారి 44పై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఇద్దరు యువకులు ప్రస్తుతం జిల్లా కేంద్ర  ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

నిజామాబాద్ – నిర్మల్ సరిహద్దులో పోలీసు సిబ్బంది మంగళవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు యువకులు టాటా ఎస్ వాహనాన్ని ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన సంబంధిత ఠాణా సిబ్బంది ముందున్న పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా, అప్పటికే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు టాటా ఏస్ వాహనాన్ని అడ్డుకుని వారికి అప్పగించారు. టాటా ఏస్ వాహనంలో ఉన్న ఇద్దరు యువకులను జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ హఫీజ్, షేక్ రహీమ్ గుర్తించారు. యువకులను విచారించగా నిర్మల్ లో ఆయిల్ అన్ లోడ్ చేసి వస్తున్నామని సమాధానమిచ్చారు.

దాడి చేశారా..? జారిపడ్డారా..?

వాహనాన్ని ఆపకుండా వచ్చిన యువకులు అబ్దుల్ హఫీజ్, షేక్ రహీం ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకరికి చేయి, మరొకరి కాలు విరిగింది. తమపై ఇద్దరు ఎస్సైలు దాడి చేశారని బాధితులు తెలిపారు. అప్పటికే సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రిలో యువకులను విచారించగా వారి ముందు సైతం ఎస్సైలు దాడి చేశారని తెలిపారు. ఇదిలా ఉండగా ‘బతుకమ్మ’ ప్రతినిధి ఓ ఎస్సైని ఈ ఘటనపై వివరణ కోరగా.. టాటాఏస్ వాహనాన్ని ఆపకుండా వెళ్తున్నారని తమకు సమాచారం అందడంతో అడ్డుకుని సంబంధిత ఠాణా సిబ్బందికి అప్పగించామని అన్నారు. టాటా ఏస్ లో ఆయిల్ డబ్బాలు ఉండటం, వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోవడంతో ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ దొంగలుగా అనుమానించామని, సదరు యువకులను విచారించామని తెలిపారు. యువకులు జారి పడడంతో వారికి గాయాలయ్యాయని అన్నారు.