Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 1:53 pm Posted by : ramakrishna

ఆన్‌లైన్ ట్రాఫిక్ చలానాలపై సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి

 

. . . ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆన్‌లైన్ ట్రాఫిక్ చలానాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని  ఆర్ ఎస్ పి జిల్లా కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. బుధవారం రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  కటారి రాములు మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న ఆన్‌లైన్ ఫోటో ఆధారిత ట్రాఫిక్ చలానా విధానం అనేక లోపాలతో కూడుకున్నదని అన్నారు. వాహనదారులకు తెలియకుండానే ఫోటోలు తీసి చలానాలు విధించడం వల్ల, తప్పు నంబర్ ప్లేట్లతో ఇతరులపై ఫైన్లు పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల నిజాయితీగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.అలాగే, ఫోటో తీసిన వెంటనే నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాఫిక్ చలానా ఫైన్ కట్ చేస్తామనే సీఎం వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.నిజంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే,హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఫైన్ విధించడం కంటే హెల్మెట్ అందించే విధానం, నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు,మరోసారి తప్పు జరగకుండా ఉపయోగపడే విధానాలు అమలు చేయాలని సూచించారు.పేద ప్రజల నుంచి అక్రమంగా ఫైన్ల రూపంలో డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణికుల భద్రతకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల.నరేష్, ఆటో యూనియన్ నాయకులు ముకుంద, సయ్యద్ రఫీ,  అబ్దుల్, ముజీబ్, సయ్యద్ ఇఫ్ఫాన్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.