- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను ముట్టడించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏ పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారో చెప్పకుండా పోలీసులు హైడ్రామా సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామన్న పోలీసులు, ఇప్పుడు కంచన్ భాగ్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవితను ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారో స్పష్టంగా చెప్పాలని పోలీసులపై తెలంగాణ జాగృతి కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. పెంచిన ఆర్టీసీ బస్ పాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ‘‘బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపింది. విద్యార్థులు, చిరుద్యోగులపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుంది. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై గుదిబండను మోపారు. ఈ పెంపుతో ఒక్క ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ 300 పైగా భారం పడుతుందని అంచనా. అనేక రూట్లల్లో విద్యార్థుల కోసం బస్సులు నడపడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడింది’’ అని అన్నారు.


