Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 9:11 am Posted by : ramakrishna

ప్రారంభమైన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలు

 

. . . పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో నిర్వహించే ఎస్ఐ (సబ్ ఇన్‌స్పెక్టర్) ప్రిలిమినరీ రాత పరీక్ష నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు , బందోబస్తు విధులు, అభ్యర్థుల ప్రవేశం , తనిఖీ ప్రక్రియ , పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు , అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ , తాగునీరు , ప్రవేశ మార్గాలు , అభ్యర్థుల రాకపోకలు , పరీక్షా కేంద్రాల వద్ద క్రమబద్ధమైన నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహించే అధికారులు , సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని , విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అనవసరమైన జనసంచారం లేకుండా చూడాలని , ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని , పరీక్షల నిర్వహణకు ఆటంకం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ , పరీక్షలు ప్రశాంతంగా , సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు , ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని , అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

SI preliminary written examinations have begun