Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 3:18 pm Posted by : ramakrishna

బదిలీపై వెళ్లిన ఏఈకి షోకాజ్ నోటీసు

నిజామాబాద్, బతుకమ్మ: ధర్పల్లి మండల కేంద్రం నుంచి బదిలీపై వెళ్లిన ఏఈకి క్రమశిక్షణ చర్యల కింద షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. విద్యుత్ శాఖ బదిలీల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న ఏఈకి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యింది. ఏఈ అక్కడ విధుల్లో చేరేందుకు వెళ్లిన రోజే ధర్పల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏఈ కిందిస్థాయి సిబ్బంది కూడా తాము సైతం బదిలీల్లో ఉన్నామని చెప్పడంతో స్థానికంగా సమస్యను పరిష్కరించే వారు లేకుండాపోయారు. దీంతో ధర్పల్లి మండల కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో ఎలాగోలా సాయంత్రం వేళ పునరుద్ధరణ చేశారు. ఈ వ్యవహారం సీఎండీ వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఏఈకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ఏఈ లేని పక్షంలో కిందిస్థాయి సిబ్బంది ఎక్కడి వెళ్లారని మండలకేంద్ర వాసులు ప్రశ్నిస్తున్నారు. 10గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఏఈని ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ సిబ్బందిని వదిలేయడం సరికాదని అంటున్నారు.