. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మతి తప్పారు
. నవోదయ కోసం అడ్డదిడ్డంగా ప్రతిపాదనలు చేశారు
. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఉద్దేశం మీకు లేదని స్పష్టమవుతోంది
. బుగ్గకారుపై ఉన్న శ్రద్ధ సుదర్శన్ రెడ్డికి పనిపై లేదు
. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు
హైదరాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని బోధన్ లోని నిజాంషుగర్స్ భూమిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతిపాదనలు చేశారని, ఆయన మతితప్పి మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటైన విమర్శలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 నుంచి తాను ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం ఏడు నవోదయలు మంజూరుకాగా, అందులో తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ కు రెండు మంజూరయ్యాయని తెలిపారు. నవోదయ స్థల ఎంపికపై రెండు జిల్లాల్లోని ఎమ్మెల్యేలందరితో చర్చించానన్నారు. జగిత్యాల జిల్లా ఎమ్మెల్యేలు ఓకే చెప్పడంతో అక్కడ క్లియరెన్స్ వచ్చిందన్నారు. నిజామాబాద్ కు మంజూరైన నవోదయను తమ పార్టీ ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, ధన్ పాల్ తమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ.. జిల్లాకు సెంటర్ పాయింట్ అయిన రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్ పల్లి మండలం కలిగోటలో ఏర్పాటు చేసేందుకు తాను ఒప్పించానని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో నవోదయ ఏర్పాటు చేసేందుకు మేము ముందుకు వచ్చినా.. వారి పార్టీకి చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుపడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిగోట్ శివారులో నవోదయ ఏర్పాటుకు 30 ఎకరాల భూమి ఉందని అధికారులు ప్రతిపాదనలు పంపించగా, మరో వైపు బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన భూమిలో నవోదయ ఏర్పాటు చేయాలని సుదర్శన్ రెడ్డి కోరడం ఏమిటన్నారు. నవోదయ ఏర్పాటుకు 30 ఎకరాల స్థలం అవసరం కాగా, ఫ్యాక్టరీకి చెందిన 8 ఎకరాల భూమిలో విద్యాలయం ఏర్పాటు చేయాలని సుదర్శన్ రెడ్డి కోరడం ఆయన మతిస్థిమితం తప్పారని అనడానికి నిదర్శనమన్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్స్ ను తెరవదా? అని ప్రశ్నించారు. 40 ఏళ్లలో బోధన్ కు ఏమీ చేయలేని సుదర్శన్ రెడ్డి కి బుగ్గ కారుపై ఉన్నశ్రద్ధ పనులపై లేదని మండిపడ్డారు. ఆయన గల్లీ లీడర్ లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి ఎయిర్ పోర్టు తీసుకురాని స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి.. మేము తీసుకొచ్చిన నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోలేరా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ ఇస్తుంటే కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
