Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 9:27 pm Posted by : ramakrishna

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా

  • ఇటీవల పార్టీ మారిన బెంగాల్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన కోర్టు
  • తెలంగాణ స్పీకర్ కు సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు
  • నాలుగు వారాలలో చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు
  • తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు తప్పవా..?

 

వెబ్ డెస్క్, బతుకమ్మ : ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో  సోమవారం విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో నాలుగు వారాలలోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే అవుతుందని విచారణ సందర్భంగా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ స్పీకర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే తేల్చుకోవాలని సూచించింది. సుప్రీం కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

తెలంగాణలో ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిచి జోష్ మీద ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమైంది. దానికోసం సోమవారం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ భేటీ జరిగింది. అదే సమయంలో సుప్రీం కోర్టు, తెలంగాణ సభాపతికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలలో చర్యలు తీసుకోవాలని లేని యెడల తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పకనే చెప్పేసింది. ఇటీవల కాలంలో బెంగాల్ మాజీ కేంద్రమంత్రి ముకుల్ రాయ్ బిజేపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి త్రుణమూల్ కాంగ్రెస్ లో చేరారు. దానిపై ఆ పార్టీ హైకోర్టులో అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేయగా ఆయనను డిస్ క్వాలీఫై చేసింది. దాని నేపథ్యంలో తాను దాఖలు చేసిన అనర్హత వేటు పిటిషన్ పై స్పీకర్ తాత్సారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సుప్రీం కోర్టు గడప తొక్కడంతో ఈ మేరకు సభాపతికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కసరత్తు చేస్తున్న ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే లోకల్ బాడి ఎలక్షన్ జరుగక కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు గండిపడుతుంది. అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని సిద్దమౌతుంది. కానీ సుప్రీంకోర్టు ముందుగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని తేల్చాలని సభాపతికి అల్టీమేటం జారీ చేయడంతో వారిపై చర్యలు తీసుకోవడం ఖాయమని చెప్పాలి. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల నిర్వాహణకు సిద్దమైంది. కానీ ఎమ్మెల్యేలు డిస్ క్వాలీఫై అయితే మరోసారి ఉప ఎన్నికలు రావడం ఖాయమైనట్లే. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇదిలా ఉండగా పార్టీ మారినా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రేండళ్ళలోనే మరోసారి ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడం తప్పేలా కనిపించడం లేదు. నాలుగు వారాల్లో సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఉప ఎన్నికలు రావడం ఖాయమని ప్రతిపక్ష పార్టీలు మరోసారి ఉప ఎన్నికలకు సిద్దమయ్యాయి.