Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 6:56 pm Posted by : ramakrishna

శంభో శంకరా . . . శివనామ స్మరణతో మారు మ్రోగిన ఆలయాలు.

 

. . . భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు

 

. . . ఘనంగా శివపార్వతుల కళ్యాణం

 

. . . ఆలయాల ముస్తాబు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

శంభో శంకరా. . . ఓం నమశ్శివాయ అంటూ భక్తుల నామస్మరణ తో ఆలయాలు హోరెత్తాయి. ఆదివారం ఉదయం నుంచే శివాలయాల్లో భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనల కోసం భక్తులు బారులు తీరారు. శివలింగానికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, నిర్వహించే భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. శివునికి పంచామృతాలతో పాటుగా చెరుకు రసంతో , కొబ్బరి బొండాల రసంతో, నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం నిర్వహిస్తే శుభాలు కలుగుతాయని భక్తులు భావించి శివాలయాల్లో పెద్దఎత్తున పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. శివారాధన బిల్వ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు జాగరణ చేస్తూ శివనామస్మరణతో గడిపారు. శివునికి ప్రీతికరమైన నైవేద్యాలను భక్తితో సమర్పించారు. రాత్రి జాగరణ లో భక్తి పాటలు భజనలు పలు ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాలు కన్నుల పండుగగా నిర్వహించారు. శివపార్వతులు భక్తుల కోసం కైలాసాన్ని వీడి భూలోకానికి వచ్చిన అపురూప రోజైనా మహాశివరాత్రి పర్వదినం భక్తి ప్రపత్తులతో వేడుకగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శివాలయాలు మారు మ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని నగర ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందూరు కంఠాభరణం అయిన నీలకంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నీలకంఠుడికి ఆలయంలో వేద పండితులు శివలింగానికి రుద్రాభిషేకం అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఆలయంలో అభిషేకాలు కొనసాగాయి. నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుండి భక్తుల అభిషేకాలు ప్రత్యేక పూజలతో సందడి నెలకొంది. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీరామ్ రవీందర్ ఆలయ కమిటీ చైర్మన్ సిరిగిరి తిరుపతి,  సభ్యులు నందకిషోర్, నర్సింగ్ రావు, అర్చకులు సుహాస్, మకరంద్, నీలేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శంభు లింగేశ్వర ఆలయం లో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి శివునికి అభిషేకం నిర్వహించారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం నాలుగు గంటల నుండి శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త హాజరై శివునికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని దేవి రోడ్డు వద్ద గల మనోకామేశ్వరాలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని తరించారు. భక్తులు పాలతో అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేశారు. కోట గల్లీలో గల మల్లికార్జున ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివునికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Shambho Shankara... Temples resounded with the remembrance of Shiva's name.