- నిజాంసాగర్ వెలవెల
- శ్రీరాంసాగర్ కు జలకళ
- సగం వర్షాకాలం పూర్తయినా పడని సగటు వర్షపాతం
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యవసాయ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలల సమయం గడుస్తున్నా ఉమ్మడి జిల్లాలో సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. దానితో సాగు ఎలా అనే సందేహం రైతులలో వ్యక్తమౌతుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. ఎండకాలంలో వ్యవసాయ పంప్ సెట్లపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులు వర్షాకాలంలో వానపై ధీమాతో పంటల సాగుకు సిద్దమయ్యారు. రైతుల ఆశలను వమ్ము చేయకుండా జూన్ మాసంలోనే కురిసిన వర్షం రైతుల్లో ఆశలు నింపింది. కానీ వర్షాకాలంలో సగటు వర్షపాతం నమోదు మాత్రం కాలేదు. దాదాపు 45 రోజులు గడిచిపోయినా ఇప్పటికి పెద్దగా వర్షం పడిన దాఖలాలు లేవు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నాన్ కమాండింగ్ ఏరియాలో వర్షం లేకపోవడం, భూగర్భజలాలు అడుగుంటడంతో పంటల సాగు కోసం వేసిన నారుమళ్లు కూడా ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టులలోనూ నీటిమట్టం తక్కువగా ఉండడం రైతుల్లో ఆందోళనకు కారణమౌతుంది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయినిగా పేరు గాంచిన నిజాంసాగర్ లో జలకళ తప్పింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రాజెక్టులో నీటిమట్టం మాత్రం ఏమాత్రం పెరుగడం లేదు. ప్రాజెక్టులో 1405 అడుగులకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 1391.31 అడుగుల నీరుమాత్రమే ఉంది. 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 4.627 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మంజీరాకు వర్షాకాలంలో వరదనే రాలేదు. నిజాంసాగర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ గా పేరు గాంచిన సింగూర్ నిండకపోవడంతో నీటి విడుదల అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతానికి ఇన్ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు నిండడంపై ఆందోళన వ్యక్తమౌతుంది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షానికి కళ్యాణి ప్రాజెక్టు నిండడమే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు మండలాల రైతులకు ఆశలు చిగురించాయి. పోచారంతో పాటు కౌలాస్ నాలా ప్రాజెక్టులకు వరద అంతంతమాత్రంగానే వచ్చింది. మహారాష్ట్రలోని లెండి ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో జుక్కల్ ప్రాంతంలో పంటల సాగుపై రైతులకు ఆశలు వమ్మవుతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద లక్షా 80 వేల ఎకరాల సాగు అవుతుండగా సాగునీరందించే ప్రాజెక్టులో వర్షాకాలంలో 4 టీఎంసీల నీరు మాత్రమే ఉండడంతో వర్షాకాలం పంటలకు కూడా నీటి విడుదల సాధ్యమేనా అనే సంశయాలు వ్యక్తమౌతున్నాయి.
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మాత్రం జలకళ సంతరించుకుంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడకపోయినా పొరుగున ఉన్న మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో అక్కడ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు. దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ లో 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 40.304 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గడిచిన వారం గోదావరికి వరద పొంగిపొర్లడంతో లక్ష క్యూసెక్కుల వరద ఒక్క రోజే వచ్చింది. తర్వాత తగ్గుతూ ప్రస్తుతం 4022 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో విడుదల చేయడం లేదు. జూన్ 1 నుంచి ప్రాజెక్టుకు 31.204 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు 3.689 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాకాలంలో జులై మాసంలో ప్రాజెక్టుకు వరద అనేది సర్వసాధారణం కాగా ఈసారి తక్కువగా రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. గతేడాది ఆగస్టు 4న 44.937 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈసారి 4 టీఎంసీలు తక్కువగా ఉండడం విశేషం. గడిచిన ఏడాది వర్షాకాలంలో వంద టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలైంది. ఈసారి మాత్రం వరుణుడు కరుణించకపోవడంతో ప్రాజెక్టు సగం మాత్రమే నిండింది. పంటల సాగు కోసం తడుల ప్రాతిపదికన నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.