. . . విద్యార్థినిని వేధించిన ఎలక్ట్రీషియన్
. . . ఫిర్యాదు చేసిన పట్టించుకోని గురుకుల అధికారులు
. . . ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులకు లేఖతో వెలుగులోకి
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై వేధింపుల వ్యవహారం వెలుగు చూసింది. ఈ సంఘటన మెండోర మండలం పోచంపాడు బాలికల గురుకులం లో జరిగింది. గురుకులంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇటీవల స్నానాల గదికి వెళ్లగా అక్కడ మరమ్మతుల సాకుతో ఉన్న ఎలక్ట్రీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సహకరించాలంటూ విద్యార్థిని వంటిపై చేతులు వేసి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇంటికి వెళ్లిన విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఫిర్యాదు చేశారు. దానిపై గురుకుల పాఠశాల అధికారులు విషయాన్ని బహిర్గతం చేయకుండా తొక్కి పెట్టారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని పరీక్షలు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని నమ్మబలికారు. కానీ గురుకులానికి తిరిగి వెళ్లిన విద్యార్థిని అవమానాన్ని తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాయడంతో ఈ విషయం బట్టబయలైంది. వ్యవహారంపై జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదే గురుకులంలో డెంగ్యూ జ్వరంతో ఒక విద్యార్థిని మృతి చెందింది. ఆనాడు అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.