. . . పాత కక్ష్య లతో మేన మామ ను హత్య చేసిన అల్లుడు
. . . స్నేహితులతో కలిసి దారి కాచి కారుతో ఢీ కొట్టి, కత్తులతో నరికి హత్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
రాష్ట్రంలో సంచలనం రేపిన ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసును పోలీసులు చేధించారు. ఎంపీపీ ని హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సూత్రదారి ద్వారా మిగిలిన వారికి అరెస్ట్ చేసి అధికార పార్టీ నేత హత్య కేసును ముగించారు. పోలీసులు పత్రిక ప్రకటన ద్వారా తెలిపినట్టు గా …………..
మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ తెలిపారు. శనివారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు అనుమానితులు పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకోవడంతో ఇమ్మడి గోపి హత్య కు పాల్పడిన వారిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినట్టు ఏసీపీ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం లింగాపుర్ గ్రామానికి చెందిన ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపీ కి అతని మేనల్లుడైన దగ్గి సతీష్ తో కుటుంబ, భూముల వివాదాలు, రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గోపి, సతీష్ కుటుంబ సభ్యులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడంతో అవి ముదిరాయి. గత వారం లింగాపూర్ గ్రామంలో సతీష్ వినియోగిస్తున్న బోరును సర్పంచ్ హేమలత భర్త అయిన ఇమ్మడి గోపి సీజ్ చేయించాడు. దాంతో సతీష్ తన మేన మామ గోపి పై కక్ష్య పెంచుకున్నాడు. సతీష్ తన స్నేహితులు కొండ శ్రీధర్, కొండ రవికుమార్, బండోళ్ళ దేవేందర్, అల్లకొండ నర్సయ్య, కోమన్‌పల్లి ప్రశాంత్‌ల విషయాల్లో కూడా తన మేనమామ జోక్యం చేసుకొని వారిని కూడా ఇబ్బంది పెట్టేవాడని, ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి తన మేనమామ గోపిని హతమార్చాలని అనుకున్న సతీష్ ఈ విషయాని తన స్నేహితులతో చెప్పగా దానికి వారు సరేయని గోపిని చంపడానికి అందరూ కలిసి పథకం వేసుకున్నారు. అయితే సతీష్ కొన్ని రోజుల క్రితం లింగాపూర్ గ్రామానికి చెందిన చిన్నరెడ్డి, సంతోష్ రెడ్డి దగ్గరకు వెళ్ళి గోపి తనను చంపేస్తా అని బెదిరిస్తున్నాడని, ఒకవేళ నేను గోపి ని చంపకపోతే అతడు నన్ను చంపుతాడని చెప్పి, గోపి ని తన కార్ తో యాక్సిడెంట్ చేసి చంపుతానని మిగతాది ఏదైనా ఉంటె చూసుకొమ్మని చెప్పగా అంధుకు సంతోష్ రెడ్డి సరే అనగా గోపి హత్యకు ప్లాన్ వేశారు. అవకాశం కోసం ఎదురు చేస్తున్న సతీష్, అతని స్నేహితులకు ఈ నెల 11న రాత్రి సమయంలో గౌరారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇమ్మడి గోపి కారు కనిపించడంతో అక్కడ కాపు కాసి, అనంతరం గోపి తన కారులో గౌరారం నుండి లింగాపూర్ వైపు వెళ్తుండగా, కారు, బైక్ తో అనుసరించారు. దగ్గి సతీష్ తన కారుతో ఎదురుగా నడుపుకొని వెళ్లి గోపి ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదం జరగడంతో గోపి కారులో నుండి బయటకు వచ్చి పారిపోవడానికి ప్రయత్నించగా సతీష్ అతని స్నేహితులు అడ్డగించి కత్తులతో దాడి చేయగా అతను అక్కడికక్కడే మృతి చెందగా గమనించి వారు అక్కడి నుండి పరారయ్యారు. శనివారం ఇందలవాయి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిజామాబాద్ వైపు వెళ్ళే రహదారిపై పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కారులో దగ్గి సతీష్, చెన్న రెడ్డి, సంతోష్ రెడ్డి, కొండా శ్రీధర్, కొండా రవి కుమార్, అల్లకొండ నర్సయ్య, బండోళ్ల దేవేందర్, కొమన్ పల్లి ప్రశాంత్ లు నిజామాబాద్ వైపు వెల్లుతూ పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా, వెంటనే వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గోపిని తామే హత్య చేసినట్టు నేరాన్ని ఒప్పుకున్నారు. వారు చూపించిన ఆధారాల మేరకు హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలు ఉన్న ఒక “కమ్మ కత్తి”, రక్తపు మరకలు అంటిన బట్టలు, సెల్ ఫోన్ లు (7), ఒక స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్, హత్యా అనంతరం పారిపోయిన కారు ను సీజ్ చేయడం జరిగినది. అనంతరం ఏడుగురిని చట్ట పరంగా అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.
