. . . డ్రంకన్ డ్రైవ్ కేసులో బైక్ నడిపిన వ్యక్తికి 8 ఏళ్ల జైలు
. . . వాహన యజమానికి భారీ జరిమానా
జగిత్యాల, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ రోడ్డు ప్రమాద కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బైక్ నడిపి ఒక యువకుడి ప్రాణం తీసిన నవీన్ కుమార్‌కు జగిత్యాల జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి సి. రత్న పద్మావతి 8 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. లైసెన్స్ లేని వ్యక్తికి బైక్ ఇచ్చిన యజమాని అంజయ్యకు రూ.20,000 జరిమానా విధించారు. 2022 ఆగస్టు 9న మద్యం మత్తులో బైక్‌ను అతివేగంగా నడిపిన నవీన్ కుమార్ యూసుఫ్‌నగర్ క్రాస్ రోడ్ వద్ద మరో బైక్‌ను ఢీకొట్టడంతో గుండంపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి సాగర్ (22) అక్కడికక్కడే మృతి చెందగా, అతని తల్లి లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీసులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు. ఈ తీర్పు మద్యం సేవించి వాహనం నడిపేవారికి, లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చేవారికి హెచ్చరికగా నిలిచింది.