నాగర్ కర్నూల్, బతుకమ్మ :
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని పెంట్లవెల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్, ఆర్‌ఎంపీ డాక్టర్ బోగిని మల్లయ్య కుటుంబాన్ని తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడు వి. రఘునాథ్ పరామర్శించారు. జూలై 31, 2026న బోగిని మల్లయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు కురుమయ్య, నిరంజన్, నాగర్‌కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యుడు బోనాసి రాంచందర్‌తో పాటు పలువురు న్యాయవాదులు, సీనియర్ కౌన్సిల్ వి. రఘునాథ్ కలిసి మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీ మల్లయ్య భార్య బోగిని మణెమ్మతో మాట్లాడింది.
. . . ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేశాం : మణెమ్మ
తన భర్తపై దాడి జరిగే ప్రమాదం ఉందని హత్యకు ముందే పలుమార్లు పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్లు మణెమ్మ వెల్లడించారు. తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినప్పటికీ, పోలీసులు ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త హత్యకు గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే వ్యక్తులు తన భర్తపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆ ఘటనపై ఎఫ్‌ఐఆర్ సైతం నమోదైందని మణెమ్మ తెలిపారు. హత్యకు కొద్ది రోజుల ముందు కూడా మల్లయ్య తన సహచర న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన ప్రాణాలకు ముప్పు ఉందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించలేదని ఆమె పేర్కొన్నారు.
. . . భూమి వివాదమే హత్యకు కారణమా ?
2007లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన భూమిపై కొందరు వ్యక్తులు కన్నేశారని మణెమ్మ ఆరోపించారు. భూమి విలువ పెరగడంతో దానిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటన వెనుక స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని కూడా మణెమ్మ ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తన భర్తపై దాడి జరిగినప్పుడు అప్పటి అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు నిందితులకు సహకరించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ స్థానిక నాయకులు నిందితుల వైపే నిలుస్తున్నారని ఆమె ఆరోపించారు. తన భర్త కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎంతోకాలంగా మద్దతుగా ఉన్నప్పటికీ, ఆయన హత్య అనంతరం పార్టీ నుంచి కుటుంబానికి ఆశించిన స్థాయిలో సహాయం అందలేదని మణెమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అండదండల కారణంగానే నిందితులు ధైర్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
. . . ప్రధాన నిందితుల అరెస్టుపై అసంతృప్తి
హత్య జరిగి రోజులు గడుస్తున్నా ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై మణెమ్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసుల వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అవసరమైన వనరులు ఉన్నప్పటికీ నిందితులను పట్టుకోలేకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ అండదండలే కారణమని ఆమె ఆరోపించారు. తన భర్త హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, జిల్లా పోలీసు ఉన్నతాధికారులను మణెమ్మ కోరారు. మల్లయ్య కుటుంబ సభ్యుల నుంచి వివరాలను సేకరించిన నిజనిర్ధారణ కమిటీ, ఘటనకు సంబంధించిన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
