Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 12:55 pm Posted by : ramakrishna

సీనియర్ న్యాయవాది సుదర్శన్ రావు మృతి

 

 నిజామాబాద్ లీగల్, బతుకమ్మ:

నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, ప్రముఖ రాజకీయ నేత డి. సుదర్శన్ రావు(70) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.ఆయన గత పదిహేనేళ్లుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన కుమారుడు విశ్వక్ సేన్ రాజ్ కూడా న్యాయవాదిగా, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా ఉన్నారు.తెలుగుదేశం పార్టీ పుట్టుకనుండి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం ముందు వరకు ఆ పార్టీ కీలకంగా పని చేశారు.నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత కేశ్ పల్లి గంగారెడ్డి అనుచరుడుగా ఉన్నారు. సీనియర్ రాజకీయ నేతలు మాజీ ఉమ్మడి రాష్ట్ర మంత్రులు డి. సత్యనారాయణ, మండవ వెంకటేశ్వర్ రావు లతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ గా పాల్గొన్నారు.సుదర్శన్ రావు మృతి పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు, ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని అన్నారు. జిల్లా కోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ లో సోమవారం పదిన్నర గంటలకు సంతాప సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు