- ఎంపిక చేసిన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు
- విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరావాసం, పునరేకీకరణకు కృషి
- వ్యవసాయం , వాతావరణ మార్పులు వలసలకు ఉన్న సంబంధంపై అధ్యాయనం
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన కుటుంబాల స్థితిస్థాపకతను మెరుగుపర్చడం కోసం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు రెండు జిల్లాలను ఎంపిక చేశాయి. గల్ప్ వలసల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాను, అంతర్గత వలసల నేపథ్యంలో నారాయణపేట్ జిల్లాను ఎంపిక చేశారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సిరికొండ మండలం మల్లారం, న్యావనంది, ధర్పల్లి మండలం దుబ్బాక, హొన్నాజిపేట గ్రామాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. అనిశ్చితి వర్షపాతం, వరదలు, కరువులు తదితర వాతావరణ కారణాల వలన ప్రజలు తరుచుగా వలస వెళ్లాల్సి వస్తున్న విషయంపై ప్రాజెక్టు ద్రుష్టి సారిస్తుంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాలైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూనైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ లు మైగ్రేషన్ మల్టీ పార్టినర్ ట్రస్ట్ ఫండ్ మద్దతుతో రెండు సంవత్సరాల కార్యక్రమంను అమలు చేయాలని సంకల్పించడం పట్ల టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గురువారం ధర్పల్లి మడలంలోని దుబ్బాక, హొన్నాజిపేట్, సిరికొండ మండలంలోని మైలారం, న్యావనంది గ్రామాలను సిస్టర్ లీజ్ జోసెఫ్, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డిలు ఆయా గ్రామాలను సందర్శించారు. వీరిని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలిసి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల వలస కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.