. . . రైతులకు అవగాహన సదస్సులు
ఇందల్వాయి, బతుకమ్మ:
ఖరీఫ్-2026 సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల ప్రణాళిక, ప్రభుత్వ సూచనలపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికల్లో విత్తన మేళాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఇందల్వాయి, లోలం, నల్లవెల్లి రైతు వేదికల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రైతులు ప్రభుత్వ సూచనలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఖరీఫ్-2026కు అందుబాటులో ఉన్న వివిధ పంటల విత్తనాల వివరాలు, విత్తనాల నాణ్యత, ఎంపిక, సాగు పద్ధతులు, పంటల నమోదు, క్రాప్ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలపై రైతులకు వివరించారు. ప్రభుత్వం సూచించిన ఏడు సన్నరకాల వరి విత్తనాలైన బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎమ్‌టీ సోనా, జైశ్రీరామ్, కేఎన్‌ఎమ్-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎమ్ రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు, విత్తన విక్రేతలు పాల్గొన్నారు. వ్యవసాయ విస్తరణాధికారి (ఏవో) శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అపూర్వ, కిసాన్ అప్ ట్రేడర్స్ యజమానులు తదితరులు హాజరయ్యారు.
