Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 6:03 pm Posted by : ramakrishna

భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలో పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, బంగారం కొనుగోలు, అమ్మకాల నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఆదివారం కరీంనగర్ లోని బంగారం షాపులో జరిగిన దొంగతనం నేపథ్యంలో జిల్లా లో భద్రతా అంశాలపై కీలకంగా దృష్టి సారిస్తూ సీపీ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లు, బంగారు దుకాణాల యాజమాన్యం, ఏటీఎం సెంటర్లు, ఫైనాన్షియర్లతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో 44వ జాతీయ రహదారి, నిజామాబాద్ బార్డర్ లో మహారాష్ట్ర సరిహద్దు ఉన్నందున ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని అన్నారు. నేరస్తులు జిల్లాలోనికి ప్రవేశించి ఇలా వచ్చి అలా వెళ్లే ఆస్కారం ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బ్యాంకులు, జ్యువెలరీ షాపుల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయడం, సెక్యూరిటీ గార్డులను నియమించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాగే రాత్రి వేళల్లో పహారా బలపరచాలని, నగదు, బంగారం రవాణా సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేసి భద్రతను మెరుగుపరచడానికి తమ వంతు సహకారం అందిస్తామని బ్యాంకు మేనేజర్లు, దుకాణ యజమానులు హామీ ఇచ్చారు. ఈ సమావేశం ద్వారా నగరంలో చోరీలు, దోపిడీలు వంటి నేరాలను నివారించడంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి ఏ.ప్రకాష్, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, రూరల్ సిఐ సతీష్ కుమార్, ఎస్హెచ్వోలు, ఎస్సైలు సిసిఆర్బి సిఐ అంజయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ సునీల్ కుమార్, నిజామాబాద్ గోల్డ్, సిల్వర్ మార్చండి అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.లక్ష్మి కాంత్, గోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండి యూసుఫ్, ఏటీఎం సెంటర్ల అధికారులు, ఫైనాన్స్ అధికారులు పాల్గొన్నారు.

 

 

Security measures should be further strengthened