Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 8:12 pm Posted by : ramakrishna

శాంతి భద్రతల పరిరక్షణకు బందోబస్తు చర్యలు చేపట్టాలి

 

. . . బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ సమీక్ష

 

బోధన్, బతుకమ్మ :

రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్‌లో బుధవారం పెండింగ్ కేసుల పురోగతిపై బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు, ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పండుగల సమయంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, 24 గంటల పాటు వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో సిబ్బంది అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు. బోధన్ డివిజన్ పరిధిలో నమోదైన హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారాలకు సంబంధించిన కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న బోధన్ సబ్‌డివిజన్‌లో అంతర్రాష్ట్ర నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, పొరుగు రాష్ట్ర పోలీసులతో సమన్వయం పెంచాలని కమిషనర్ సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆన్‌లైన్ మోసాల బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పేకాట, గుట్కా, ఇసుకతో పాటు ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని కమిషనర్ తెలిపారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవేలను కలిపే లింకు రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, రోడ్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించడం, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సరిచేయాలని తెలిపారు. అదే విధంగా ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్యతో పాటు బోధన్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Security measures must be implemented to maintain law and order.