Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2025, 9:46 pm Posted by : ramakrishna

పసుపు బోర్డు రహస్య సమావేశం..?

  • కొనుగోలు దారుల, విక్రేతలతో గుట్టుగా సమావేశం
  • మీడియాకు నో ఎంట్రీ

 

నిజామాబాద్, బతుకమ్మ:

పసుపు అత్యధికంగా పండించే రైతులు పసుపు బోర్డు ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని భావించగా అవి అడియాసలు అయ్యాయి. ఇప్పటి వరకు బోర్డు అధికారులు దానిపై ఇంత వరకు ఒక్క ప్రకటన చేయలేదు. ఇంత వరకు పసుపు రైతులను కలిసి వారికి పసుపు మద్దతు ధరపై కనీసం భరోసా ఇవ్వలేదు. తాజాగా పసుపు కొనుగోలు చేసే వ్యాపారులు క్వింటాళుకు రూ.500 తగ్గిస్తే ఇప్పటి వరకు పసుపు బోర్డు స్పందించలేదు.  ఈ నామ్  ద్వార జరుగు కొనుగోళ్లతో క్వింటాళ్ కు రూ.15 వేల నుంచి రూ.25 వేలు పలుకుతుందని రైతులను నమ్మించిన బోర్డు అధికారులు అది ఎలా సాధ్యం అని చెప్పిన పాపన పోలేదు.. మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రైవేట్ హోటల్ లో కొనుగోలు దారులు, విక్రేతలతో రహస్య సమావేశం నిర్వహించడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. దానికి మీడియాను మేము పిలువలేదు అంతర్గత సమావేశం అని ప్రకటించడం గమనార్హం..

దశాబ్దాల పసుపు రైతుల కల నేరవేరిందని సంబర పడాలో..  పసుపు బోర్డు ఏర్పడిన తరువాత కుడా మద్ధతు ధర లేక బాధపడాలో తెలియని పరిస్థితి ఇందూర్ పసుపు రైతులది.. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పసుపు రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడి స్వయంగా ప్రకటన చేయగా.. అది గేజిట్ రూపం దాల్చి కేంద్రవాణిజ్యమంత్రి చేతుల మీదుగా నిజామాబాద్ లో పురుడు పోసుకున్న పసుపు బోర్డుకు బాలారిష్టాలు దాటడం లేదు.. బోర్డు ఏర్పాటు ప్రకటనే తరువాయి పసుపు అత్యధికంగా పండించే ప్రాంతమైన ఆర్మూర్ రైతు పల్లె గంగారెడ్డికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ప్రకటించడంతో రైతులు తమ కష్టాలు గట్టేక్కుతాయని భావించారు. కాని ఆనాటి నుంచి పసుపు పండించు రైతులకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. పసుపు బోర్డు ఏర్పాటుతో మద్ధతు ధర దక్కుతుందని ఆశించిన రైతుల ఆశలు వమ్ము అయ్యాయి. పై పెచ్చు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కార్యక్రమం కాస్త రైతులతో జరుగాల్సింది బోర్డు చైర్మెన్ పదవి ప్రమాణ స్వీకారంగా మారిన విషయం విధితమే. నిజామాబాద్ వ్యవసాయ మార్కేట్ లో మార్చి మాసం వరకు 2 లక్షల క్వింటాళ్ళ కొనుగోళ్ళు జరుగాల్సిన చోట డబుల్ అమ్మకాలు కొనుగోళ్లు జరిగి డిమాండ్ లేక రైతుల వద్ద అగ్గువకు సగ్గువకు తేమ లేదని, పచ్చి పసుపు పేరిట వ్యాపారులు దోచుకుంటుంటే ఇప్పటి వరకు బోర్డు పట్టించుకున్న దాఖాలాలు లేవు.

Secret meeting of the Yellow Board..?

బోర్డు చైర్మన్ పల్లె గంగా రెడ్డి , నేషనల్ టర్మరిక్ బోర్డు సెక్రటరీ భవాని శ్రీ, రాష్ట్ర వ్యవసాయ కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్, నిజామాబాద్ మార్కేట్ కమిటీ చైర్మెన్ ముప్ప గంగారెడ్డి, ఆగ్రికల్చర్  జాయింట్ డైరెక్టర్ బాబు, అదపు కలెక్టర్ అంకిత్,  స్పైసీస్ బోర్డు డైరెక్టర్ రియామ్మా లు మంగళవారం రైతులు, అధికారులు,  వ్యాపారులతో జరిపన చర్చల సారాంశం బయటకు పొక్కనీయలేదు. మీడియాకు నో ఎంట్రీ అని ప్రకటించారు. జిల్లా లో పసుపు బోర్డు ఏర్పాటుతో కష్టాలు ఉండవని, మంచి గిట్టుబాటు ధర వస్తుందని నమ్మి వేల ఎకరాలలో పసుపును సాగు చేసిన రైతులకు బోర్డు రహస్య సమావేశాలు అంతు చిక్కడం లేదు. బోర్డు అధికారులు, వ్యాపారుల రహస్య ఎజెండా ఏమిటి అనే చర్చ మొదలైంది. పసుపు బోర్డు ఏర్పడిన ఇక్కడి పసుపు రైతులు సాంగ్లీ వెళ్లేందుకు సిద్ధపడటం బోర్డు అధికారులు అనుభవరాహిత్యంగా చెబుతున్నారు. పసుపు బోర్డు పాలకవర్గం లేకపోవడం, పూర్తి స్థాయి అధికారులు లేకపోవడం, పసుపు బోర్డుకు ఒక్క రూపాయి కుడా బడ్జెట్ లో కేటాయించకపోవడంతో ప్రతిపక్షాలు అది రాజకీయ నిరుద్యోగుల నిరాశ్రయం కోసం అనే విమర్శలు చేస్తున్నారు. పసుపు రైతుల కష్టాలు కాకుండా, వారు పండించిన పంటకు మంచి ధరకు కొనుగోళ్లు జరిగేలా, దళారీ వ్యవస్థను రుమాపాల్సిన బోర్డు అధికారులు అందరు రైతులకు తెలయకుండా రహస్య సమావేశాలు ఏమిటని మండిపడుతున్నారు.

Secret meeting of the Yellow Board..?