Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 8:29 pm Posted by : ramakrishna

నీట మునిగిన వరి పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు

 

కోటగిరి, బతుకమ్మ :

 

ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం కోటగిరి మండలంలోని సైలంపూర్ గ్రామ పరిధిలో, పోతంగల్ మండలంలోని తీర్మాల్లాపూర్ గ్రామ పరిధిలో శనివారం నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు. పొలంలో నిల్వ ఉన్న నీటిని వీలయినంత తొందరగా తీసి వేయాలని, పూర్తిగా కుళ్ళి పోయిన మొక్కలను గుర్తించి, మళ్ళీ నాటుకోవాలని రైతులకు సూచించారు. పసుపు రంగు లోకి ఆకులు మారినట్లు గమనించినట్లయితే 2% యూరియా లేదా 19.19.19 ను 5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కాండం తొలిచే పురుగు నివారణకు, నాట్లు వేసిన 25 రోజులకు రైతులు తప్పనిసరిగా కార్బోఫ్యూరాన్ 3జి ఎకరాకు పది కిలోల చొప్పున వేసుకోవాలని, పొలంలో ఎకరాకు 5-6 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకుని పురుగుల ఉనికిని గమనిస్తూ ఉండాలన్నారు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు చొప్పున పిచికారి చేసుకోవాలని సూచించారు.  ఈ క్షేత్ర సందర్శనలో శాస్త్రవేత్తలు సమతా పరమేశ్వరి, ఎం.సాయి చరణ్, బి.మంజు భార్గవి, రమ్య రాథోడ్, ఏఈఓ గౌస్, రైతులు గంగారాం, విట్టల్, వీరబాబు, ఇస్మాయిల్, బీర్కూర్ సంతోష్, రైతులు పాల్గొన్నారు.