. . . టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్
కామారెడ్డి, బతుకమ్మ :
ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి విద్యను కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు. పది రోజుల క్రితం రూ.100 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ నిధులను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉన్నందున, పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరో 4.5 లక్షల మంది విద్యార్థులు ఫీజు బకాయిల కారణంగా తమ విద్యాసంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి నుంచి 500 మంది విద్యార్థులతో ఈ నిరసన చేపట్టామని, అవసరమైతే 5,000 మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని టీజీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎండి సమీర్ ఖాన్, మోహన్, భరత్, ధనుష్, అఖిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.