Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:17 pm Posted by : ramakrishna

రేపు గన్నారం కు ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాక

 

. . . గన్నారం గ్రామంలో ఎస్సీలపై సామాజిక బహిష్కరణ

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామంలో గత రెండు నెలలుగా ఎస్సీ వర్గాలపై సామాజిక బహిష్కరణ కొనసాగుతోందని గ్రామానికి చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సామాజిక బహిష్కరణ కోసం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్వయంగా గన్నారం గ్రామానికి చేరుకుని గ్రామ అభివృద్ధి కమిటీ పై బుధవారం విచారణ నిర్వహించడానికి వస్తున్నారని తెలిసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతో పాటు పోలీసులు సైతం ఎస్సీ కమిషన్ రాకపై ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ వీడీసీ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎస్సీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం, ఎస్సీలకు గ్రామంలో పనులు ఇవ్వకుండా అడ్డుకోవడం, పనికి పిలవకపోవడం, నిబంధనలు ఉల్లంఘించారనే పేరుతో జరిమానాలు విధించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇదే సమయంలో గ్రామంలోని అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేసిన బోర్డును ఎమ్మార్వో సమక్షంలో వీడీసీ తొలగించిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నేడు ఎస్సీ కమిషన్ అధికారులు ఘటనపై ఆరా తీసి, బాధితులు, స్థానిక అధికారులు సంబంధిత వర్గాల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

SC Commission Chairman Bakki Venkataiah to visit Gannaram tomorrow.