Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:25 pm Posted by : ramakrishna

సాయన్న సేవలు మరువలేనివి

 

. . . బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి రామచంద్రుడు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిగా, కవిగా, కళాకారునిగా, సాంస్కృతిక సైనికుడిగా, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన ఈర్ల సాయన్న సేవలు చిరస్మరణీయమని బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి రామచంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన ఈర్ల సాయన్న సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే సాయన్న దాదాపు 200 సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారని, తన కళా ప్రతిభకు గుర్తింపుగా నంది అవార్డు అందుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. పెన్షనర్స్ యూనియన్ నాయకులు కె. రామ్మోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు తిరుమలాచారి మాట్లాడుతూ, సాయన్న చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సంఘాన్ని ఐక్యంగా ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. సభలో సాయన్న కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన నిరాడంబర జీవనం, సేవా తత్పరత, సామాజిక స్పృహను స్మరించుకున్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు శిర్ప హనుమాన్లు మాట్లాడుతూ, యోగా రంగంలో సాయన్న అనేక మందికి శిక్షణ ఇచ్చి ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించారని తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్, ఆల్ పెన్షనర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ సాయన్నతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజానాట్య మండలి కళాకారుడు శిర్ప లింగయ్యతో పాటు పురుషోత్తంరావు, సాయిలు, అశోక్, రామస్వామి, గంగాధర్, కుటుంబ సభ్యులు పాల్గొని సాయన్న జీవిత విశేషాలను, సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించి నివాళులర్పించారు.