Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 6:41 pm Posted by : ramakrishna

సర్పంచ్ లు ఆదర్శ గ్రామాల నిర్మాణానికి కృషి చేయాలి

 

. . . జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

సర్పంచ్‌ లు గ్రామ పరిపాలనలో పారదర్శకతను పాటిస్తూ, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, ఆదర్శ గ్రామాల నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో “గ్రామ అభివృద్ధి – సర్పంచ్‌ల పాత్ర” అనే అంశంపై మంగళవారం ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధిలో స్థానిక నాయకత్వం, ముఖ్యంగా సర్పంచ్‌ల పాత్రను బలోపేతం చేయడం, సమగ్ర గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం చేయడంపై ఈ కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా, తమ పరిసర గ్రామాల అభివృద్ధికి కూడా సహకరించాలనే ఆలోచనను, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని గుర్తు చేశారు. సర్పంచ్ లు తమ పల్లెలు అభివృద్ధి చెందెలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి మాట్లాడుతూ యూనివర్సిటీలు, గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలపడాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. రాంబాబు గ్రామాభివృద్ధిలో విద్యా సంస్థల పాత్రను వివరించారు. డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్‌లు ఈ సదస్సులో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం నిర్వహించిన సాంకేతిక సమావేశాల్లో మొదటి సెషన్‌ను సాయ గౌడ్, రెండవ సెషన్‌ను ప్రొఫెసర్ కె. రవీందర్ రెడ్డి, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిర్వహించారు. ఈ సెషన్లలో గ్రామాభివృద్ధి పథకాల అమలు, సమస్యల పరిష్కారం, ఉత్తమ పద్ధతులపై చర్చించారు. మధ్యాహ్నం సర్పంచ్‌లకు సన్మానం కార్యక్రమం నిర్వహించి, వారి సేవలను గుర్తించి గౌరవించారు. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ కన్వీనర్ ప్రొఫెసర్ సి.హెచ్. అంజనేయులు నేతృత్వంలో అధ్యాపక బృందం సమర్థవంతంగా నిర్వహించింది. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన గంగాకిషన్, డా. కిరణ్ రాథోడ్, ప్రవీణ్, రాజేశ్వర్, శ్రీనివాస్, ఇతర అధ్యాపకులు, నిర్వాహకులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.