ఏర్గట్ల, బతుకమ్మ :
తాళ్ల రాంపూర్ గ్రామంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక రేట్లకు ఇసుకను విక్రయిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమంగా ఇసుకను అధిక ధరలకు అమ్ముతూ పేదల సొంతింటి కలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై లబ్ధిదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు సర్పంచ్ పావని భానుచందర్ ఏర్గట్ల మండల కేంద్రంలోని తహసిల్దార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించవద్దని సూచించారు. ఎవరైనా అధిక ధరలు డిమాండ్ చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అక్రమ ఇసుక విక్రయాలను అడ్డుకుని లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చివరి వరకు పోరాటం చేస్తానని సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్ స్పష్టం చేశారు.