- గాండ్ల పేట్ పెద్దవాగు నుంచి తవ్వకాలు
- తహసీల్దార్ కార్యాలయం వెనుక డంపింగ్
- పట్టపగలు టిప్పర్ లు టారాజ్ లలో అక్రమంగా ఇసుక రవాణా
మోర్తాడ్, బతుకమ్మ : ఆయనో అధికార పార్టీకి జిల్లా పార్టీలో (మండల) నేత. ఉండేది మోర్తాడ్ మండలంలో… ఆయన వెనుక ఉన్నది అధికార పార్టీకి చెందిన జిల్లా పెద్ద నేత.. కాని వారి వెనుక నేత ఒక కార్పొరేషన్ చైర్మెన్.. దానితో అక్కడ ఇసుక తవ్వకాలు అధికారికంగా తక్కువ.. అనాధికారికంగా ఎక్కువగా జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నలలో కావడంతో అక్కడ జిల్లా అధికార యంత్రాంగం కళ్లు ఉండి చూడలేని పరిస్థితి నెలకొంది. ఏకంగా మైనింగ్ డిపార్ట్ మెంట్ అండ ఉందని ఆ శాఖ మోర్తాడ్ మండలంలో ఇసుక తవ్వకాల అలాంటివి ఎప్పుడు వినలేదు అన్నట్టు వ్యవహరిస్తుంది. ఉన్నదల్లా స్థానికంగా రెవిన్యూ, పోలీస్ యంత్రాంగం. ఆ రెండు శాఖలు ఇసుక తవ్వకాల విషయంలో తమకు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇసుక రాత్రి వేళ తవ్వితే మైనింగ్ శాఖ రాదు, గాండ్ల పేట్ పెద్ద వాగులో తవ్విన ఇసుకను తహసీల్ధార్ కార్యాలయం వెనుక డంపింగ్ జరుగుతుంటే పట్టించుకోదు. పోలీస్ శాఖకు జేసిబిలు, టిప్పర్ లు, టారజ్ లు కనిపించవు.. దొరికితే ట్రాక్టర్ లను రెవిన్యూ శాఖకు అప్పగించి తమ పని ముగిసిందనపిస్తున్నారు….

నిజామాబాద్ జిల్లాలో ఇసుక రీచ్ లకు కేవలం బోధన్ ప్రాంతంలోనే ఆరు పాయింట్లకు అనుమతులు ఇచ్చారు. దానికి రెవెన్యూ, భూగర్భ వనరుల శాఖ, నీటి పారుదల శాఖతో పాటు ల్యాండ్ సర్వే అధికారులు సర్వే చేసి సంబంధిత పాయింట్లలో ఇసుక తవ్వకాలకు పరిమితులకు లోబడి ఇచ్చారు. కానీ బాల్కొండ నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వేల్పూర్, మోర్తాడ్ మండలాల మీదుగా తడపాకల్ లో గోదావరిలో కలిసే పెద్దవాగులో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. పేరుకు వే బిల్లులతో స్థానిక అవసరాల పేరు మీద ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రాత్రి అయిందంటే వాగుల్లో మిషన్ లతో, టిప్పర్లతో ఇసుక తవ్వకాలు, తరలింపు జోరుగా సాగుతుంది. ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీ లీడర్లు ఉండడంతో ఇసుకను బహిరంగంగా తవ్వేస్తున్నారు. దానిని మోర్తాడ్ తహసీల్ధార్ కార్యాలయం వెనుక డంప్ చేస్తున్నారు. అక్కడ అధికారులు పట్టినా నామమాత్రపు జరిమానా లేదా వేలం వేస్తారని వాటిని బహిరంగంగా కొనుగోలు చేసి రవాణా చేసే తంతు కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు చిన్నచితక ట్రాక్టర్లలో ఇసుక మాత్రమే పట్టుకున్నారు. ఇక్కడ జేసీబీలు, టిప్పర్లు పట్టుబడలేదు. వాటితోనే ఇసుక దందా జోరుగా సాగుతుంది. రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖాధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

రెవిన్యూ, పోలిస్ శాఖలు తమకు దాసోహం కావడంతో అధికార పార్టీ నేతలు బరితెగించారు. ఇసుక కావాల్సిన వారి కోసం ఏకంగా ఒపెన్ ఆఫర్ ప్రకటించారు. ట్రాక్టర్ కు రూ. 350 తక్కువకు దొరుకుతుందని కావాల్సిన వారు సంప్రదించాలని బహిరంగంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. మోర్తాడ్ అధికార పార్టీ నేతకు, ఒక కార్పోరేషన్ చైర్మెన్ పుత్రరత్నం తోడు కావడంతో నిత్యం ఇసుక తవ్వకాలు, అమ్మకాలు సాగుతున్నాయి. భవిష్యత్తులో బాల్కొండ నియోజకవర్గంపై తన పెత్తనం ఖాయమని ఇప్పటి నుంచి ఆర్థిక వనరుల కోసం అక్రమ ఇసుక తవ్వకాల దందా చేపట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు క్యాంపు కార్యాలయం కట్టడం కోసం ఏకంగా నిధుల సమీకరణపై నజర్ వేసిన నేత ఇసుక దందాను తన గుప్పిట పెట్టుకున్నాడని టాక్. జోడు పదవులు ఉన్న నేత మండల స్థాయి నేతను తెరపై ఉంచి ఇసుక దందాతో నిత్యం కలెక్షన్ లో బిజీగా ఉన్నాడని పార్టీలో ప్రత్యర్థి వర్గాలు చెబుతున్నాయి. అసలే బాల్కొండ నియోజకవర్గంలో నలుగురు నేతల తాకిడిలో నలిగిపోతున్న అధికార పార్టీకి మోర్తాడ్ మండలంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా దందా చెడ్డపేరు తెచ్చేలా ఉంది.
