Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2025, 2:23 pm Posted by : ramakrishna

పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, దోమల వ్యాప్తి అరికట్టేందుకు ఫాగింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డ్ నెంబర్ 17, అశోక్ నగర్, స్నేహపురి కాలనీ, తదితర వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డుల్లో నిరంతర పారిశుధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో మురికి కాల్వల్లోని నీరు ప్రవహించే విధంగా చూడాలని, మురికి కాల్వలు, రోడ్లపై నీరు నిలవకుండా ఉండేవిధంగా పనులు చేపట్టాలని అన్నారు. నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేపట్టాలని తెలిపారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్త, ఇసుక ను జె.సి.బి. తో తొలగించాలని అన్నారు. ప్రతీ వార్డ్ ల ఇన్ చార్జీలు రోజు వార్డుల్లో పర్యటించి శానిటేషన్ కార్యక్రమాలు పరిశీలించాలని, అధికారులు కూడా పర్యవేక్షించాలని తెలిపారు. పట్టణంలో ఎలాంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా శానిటేషన్ కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని తెలిపారు. తాగునీటి పైప్ లైన్ లు లీకేజీ లేకుండా చూడాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, సహాయ ఇంజనీరు శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.