- జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి నిలువ ఉన్న నీటిని డబ్బాల నుండి కింద పారబోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురిచిన అధిక వర్షాల వలన ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నందున పంచాయతీ సిబ్బంది జాగ్రత్తగా నీరు నిలువ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నీరు బయటకు వెళ్లే అవకాశం లేనిచోట ఆయిల్ బాల్స్ వేయాలని, దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయాలని, డ్రైనేజీలలో నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా అన్ని గ్రామ పంచాయతీలలో పకడ్బందీగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలకు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎంపీడీవో సాజిద్ అలీ, తాసిల్దార్ శ్వేత, ఎంపీఓ సరిత రెడ్డి,మండల ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.