. కల్దుర్కి గ్రామ రైతుల రాస్తారోకో
. ఇసుక రవాణా నిలిపివేయాలని ఆందోళన
. ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్
బోధన్, బతుకమ్మ: బోధన్ మండలం కల్దుర్కి, సిద్దాపూర్ కండ్ గావ్ నుంచి ఇసుక రవాణాను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేరకు సోమవారం కల్దుర్కి గ్రామ రైతులు ఇసుక టిప్పర్లను అడ్డుకుని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
మంజీర నదిలో నుంచి అనేక రోజులుగా అనుమతులు, వే బిల్లుల పేరుతో ఇసుక తరలిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం టెండర్ ప్రక్రియ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, కానీ టెండర్ ప్రక్రియ లేకుండా వేబిల్లుల పేరుతో అనుమతులు ఇవ్వడంతో కొంతమంది తమ వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని ప్రతి టిప్పర్ లో పరిమితికి మించి అధికలోడుతో ఇసుక తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక లోడ్ తో వాహనాలు వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కండ్ గావ్, సిద్దాపూర్ పాయింట్ ల నుంచి ప్రతిరోజూ పరిమితికి మించి ఇసుక తరలిస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని, భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులకు అదే విధంగా బోర్లు ఎత్తిపోతున్నాయని అన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా సమస్యలు పట్టించుకోవాలని ఎన్ని సార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ ప్రధాన రహదారిపై గ్రామస్తులు రైతులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు వచ్చి రైతులకు గ్రామస్తులకు సముదాయించారు. ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన భవిష్యత్తులో ఉదృతం చేస్తామని రైతులు గ్రామస్తులు హెచ్చరించారు. రాస్తా రోకో లో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.