– ఇసుక మాఫియాకు చట్టాలు వర్తించవా?..
– నెంబర్ ప్లేట్స్ లేని ట్రాక్టర్ లలో ఇసుక అక్రమ రవాణా
– చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్న అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. అనుమతుల పేరిట కొందరు అక్రమార్కులు ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. 20 ట్రాక్టర్ లకు ఇసుక అనుమతులు ఉంటే మరికొన్ని ఇసుక ట్రాక్టర్లకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పోతంగల్ పరివాహక ప్రాంతం నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో జోరుగా రవాణా చేస్తున్నారు.రుద్రూర్ గ్రామం మీదుగా బొప్పాపూర్, వర్ని ఇతర గ్రామాలకు ఇసుకను తరలిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇసుక ట్రాక్టరలకు నెంబర్ ప్లేట్స్ కూడా లేవని, అసలు ఏ ట్రాక్టర్ ఎటు వెళ్తుందో ఎక్కడ ఇసుకను అమ్ముకుంటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రుద్రూర్ మండలంలోని సులేమాన్ ఫారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అశోక్ లాయ్ ల్యాండ్ వాహనంలో గ్రీన్ మ్యాట్ కప్పి ప్రతి రోజు ఐదారు ట్రిప్పులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వెలువేత్తుతున్నాయి. మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన అధికారులకు శాలువాలతో సన్మానించి బ్యారాలు కుదుర్చుకుని ముడుపులు ముట్టజేప్పుతున్నారేమోనని, సీసీ కెమెరాలు సాక్షిగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకవడం గమనార్హం.
నెంబర్ ప్లేట్స్ లేని ఇసుక ట్రాక్టర్ లకు చట్టాలు వర్తించవా..?
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామాల్లో పోలీసులు నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను తనిఖీ నిర్వహించి, అట్టి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే అనుమతుల ముసుగులో కొందరు అక్రమార్కులు ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. చాలా వరకు నెంబర్ ప్లేట్స్ లేని ట్రాక్టర్ లలో ఓవర్ లోడ్ తో అతివేగంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మరి వీరికి చట్టాలు వర్తించవా?.. అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా కుడా అధికారులు చూసి చూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పోతంగల్ తహసీల్దార్ కు చరవాణిలో వివరణ కోరాగా, 20 ఇసుక ట్రాక్టర్ లకు అనుమతులు ఇచ్ఛామని సమాధానమిచ్చారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.