. నిజామాబాద్ జీజీహెచ్ లో అధికారుల లీలలు
. సంబంధం లేని వివరాలతో ఎంఎల్ సి నంబర్ ల కేటాయింపు
. కేసుల తారుమారుకేనా?
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు కేసుల నమోదులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే ఎంఎల్ సీ (మెడికల్ కేస్ లీగల్ రికార్డ్) రిపోర్టు ఎంతో కీలకం. గొడవలు, ప్రమాదాల్లో చోటు చేసుకున్న గాయాలకు సంబంధించి డాక్టర్లు సర్టిఫై చేసే ఎం ఎల్ సీ రిపోర్టు ప్రామాణికంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. సంబంధిత రిపోర్టును ప్రభుత్వ వైద్యుడు సర్టిఫై చేయడంతో పాటు అవసరమైనప్పుడు కోర్టులో తన సాక్ష్యంగా చెబుతుంటారు. వైద్యులు ఇచ్చే రిపోర్టు ప్రామాణికంగానే కేసుల్లో సెక్షన్ లు మారి శిక్షలు ఖరారవుతాయ. అటువంటి ఎం ఎల్ సీ రిపోర్టు రిపోర్టు తారుమారు చేయడం అసాధ్యం. ఒక వేళ ఎం ఎల్ సీ రిపోర్టు తారుమారైతే కేసులు నీరుగారుతాయి. ఎం ఎల్ సీ రిపోర్టును తారుమారు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వెలుగుచూసింది.
రెండు ఎం ఎల్ సీ బుక్కులు
నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏకంగా రెండు ఎంఎల్ సీ బుక్ లు ఉన్న విషయం బహిర్గతమైంది. 2023 లో 2551 సిరీస్ లో 2600 పేరుతో ఉన్న సిరీస్ బుక్ లో 50 పేజీల ఒక ఎం ఎల్ సీ బుక్ ఉంది. అందులో 2023 జూన్ 20న ఆరో టౌన్ పొలిస్ స్టేషన్ పరిధిలో ఒకే కేసు నమోదైంది. అందులో కత్తిపోట్ల కేసు నమోదులో సెక్షన్ అల్ ట్రేషన్ కు సంబందించి బాధితుడు జిల్లా జనరల్ ఆస్పత్రిలో దాని ఒరిజనల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయం వెలుగు చూసింది. నిజామాబాద్ రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2589 నంబర్ లో మరో వ్యక్తి గాయపడినట్లు నమోదు కావడంతో ఆస్పత్రిలో ఒకే సిరీస్ తో రెండు ఎం ఎల్ సీ బుక్కులు ఉన్నట్లు రుజువైంది. రెండు కేసుల్లో ట్రీట్ మెంట్ చేసినట్లు ఒకే డాక్టర్ సర్టిఫై చేయడం గమనార్హం.
బాధితుడి ఫిర్యాదు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో రెండు ఎం ఎల్ సీ బుక్ లు ఉన్నట్లు తెలుసుకున్న బాధితుడు దీనిపై జీజీహెచ్ లో సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. జీజీహెచ్ లో రెండు బుక్ ల ఎంఎల్ సీలో ఒక కేసు నమోదు స్థానంలో అసలు పోలీస్ స్టేషన్ కు సంబంధం లేకుండా రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి పడినట్లు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రెండో బుక్ లో బాధితుడి పేరు మినహా ఫోన్ నంబర్ నమోదు చేయకపోవడం గమనార్హం. పోనీ అప్పుడు కేసు నమోదుకు సంబంధించిన వ్యక్తికి ట్రీట్ మెంట్ చేసినట్లు పోలీస్ స్టేషన్ లో ఎవరికి సమాచారం ఇచ్చారనేది లేకపోవడ గమనర్హం. అయితే ఓ కేసును తారుమారు చేసేందుకు పకడ్బందీగా ఏకంగా ఎంఎల్ సీ బుక్ ను తయారు చేసి సంబంధిత కేసు స్థానంలో మరో కేసు ఉన్నట్లు తారు మారు చేసినట్లు తెలిసిపోయింది. కొన్ని రోజుల పాటు పాత ఎంఎల్ సి బుక్ దొరక లేదని తరువాత మాత్రం రెండు బుక్ లు ఉన్నట్లు ఒప్పుకోవడం విశేషం. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఆరో టౌన్ పోలీసులకు సంబంధిత కేసులో పూర్వపరాలను పరిశీలించి నిజమైన ఎం ఎల్ సీ ఏదో గుర్తించాలని కోరారు. ఇదిలా ఉండగా బాధితుడు ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో సంబంధిత కేసు తారుమారు కోసం కొత్త ఎం ఎల్ సీ బుక్ లో సంబంధం లేని కేసు వివరాలను చేర్చి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏకంగా జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎంఎల్ సి బుక్ ను మార్చేసే అవసరం ఎవరికి వచ్చిది? అందుకు సహకరించిన వారెవరు? అనే చర్చ జరుగుతోంది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారా? లేదా? వేచి చూడాల్సిందే.

