- ప్రతీ గులాబీ సైనికుడు ఒక కేసీఆర్ లా కదం తొక్కాలి
- కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తాం
- బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రసాధన కోసం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి ఆమరణదీక్షకు దిగిన చారిత్రిక నవంబర్29 ’దీక్షా దివస్’ స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై సమరశంఖం పూరిద్దామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 29న దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లపై చర్చించడానికి నిజామాబాద్ నగరంలో బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ జిల్లా ముఖ్య నేతలంతా పాల్గొన్న ఈ సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ గులాబీ సైనికుడు ఒక కేసీఆర్ లా మారి కాంగ్రెస్ ను తెలంగాణ నుంచి శాశ్వతంగా తరిమికొట్టడానికి కదం తొక్కాలన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ చచ్చుడో, రాష్ట్రం వస్తే జైత్రయాత్ర, రాకుంటే నా శవయాత్ర అని పోరు గర్జన చేసి గల్లీ నుంచి డిల్లీ వరకూ ఉద్యమ జ్వాల రగిలించిన యోధుడు కేసీఆర్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 36పార్టీలను ఒప్పించి నై– తెలంగాణ అన్న వారిచే జై–తెలంగాణ అనిపించిన ధీశాలి కేసీఆర్ పోరాట స్పూర్తితో కాంగ్రెస్ ముష్కర పాలనకు సమాధి చేద్దాం, మళ్ళీ కేసీఆర్ స్వర్ణ యుగానికి పునాది వేద్దాం అని ఆయన అన్నారు. ఎలెక్షన్ ఏదైనా ప్రజల సెలెక్షన్ కేసీఆర్ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో’వార్’ వన్ సైడ్ అని, కాంగ్రెస్, బీజేపీ పతనం డిసైడ్ అని ఆయన చెప్పారు. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేయడంలో నిజామాబాద్ జిల్లాదే కీలక పాత్ర కావాలన్నారు. నిజామాబాద్ జిల్లాను బీ ఆర్ఎస్ కంచుకోటగా అభివర్ణించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పతనాన్ని ఇందూరు గడ్డ నుంచే శాసిస్తామన్నారు.
