రుద్రూర్, బతుకమ్మ: కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని సేకరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైస్ మిల్లర్ల వ్యవహారం ఇటు అధికారులకు, అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యాన్ని రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోస్తున్నారు.
క్యూ కడుతున్న ప్రైవేటు వ్యాపారులు
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేటు వ్యాపారులు రైతుల కల్లాల వద్దకు క్యూకడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కన్నా వంద రూపాయలు తక్కువగా చెల్లిస్తున్నప్పటికీ రైతులు ప్రైవేట్ వ్యాపారులకే తమ ధాన్యాన్ని విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. దళారులు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తుండటంతోపాటు తేమ, తరుగు జోలికి వెళ్లడం లేదని రైతులంటున్నారు. కేవలం బార్దాన్ (సంచి) తరుగు కిలో తీసేస్తున్నారని అంతకు మించి ఏమీ తీయడం లేదని రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించడం లేదని, ఇప్పటికే రోడ్లపై ఆరబోసిన ధాన్యం మూడు సార్లు తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
