. . . న్యూఢిల్లీలో బాలల అక్రమ రవాణా వ్యతిరేక జాతీయ ప్రచారం సమావేశం
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సాధన సంస్థ క్షేత్రస్థాయి బాలల హక్కుల సంస్థ అయిన న్యూఢిల్లీలో ప్రారంభించిన దేశవ్యాప్త బాలల అక్రమ రవాణా వ్యతిరేక జాతీయ ప్రచారంలో భాగంగా బాలల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఒక నిర్ణయాత్మక ప్రచారాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన “బాలల హక్కులు సామర్థ్యం శ్రేయస్సును నిర్ధారించడం” అనే నాలుగు రోజుల జాతీయ సంప్రదింపుల సందర్భంగా బాలల అక్రమ రవాణా వ్యతిరేక జాతీయ ప్రచారం ప్రారంభించబడింది. బాలల హక్కులను పరిరక్షించడానికి 2030 నాటికి భారతదేశాన్ని మానవ అక్రమ రవాణా రహిత దేశంగా మార్చడానికి కృషి చేస్తున్న 250కి పైగా పౌర సమాజ సంస్థల జాతీయ నెట్‌వర్క్ అయిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ జేఆర్ఎస్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా 782 జిల్లాల నుండి భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఈ సంప్రదింపుల సమావేశంలో పాల్గొన్నారు. సాధన సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ యొక్క భాగస్వామ్య సంస్థ. పిల్లలపై జరిగే నేరాలకు వ్యతిరేకంగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ప్రపంచంలోనే అతిపెద్ద న్యాయపరమైన జోక్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దాని భాగస్వామ్య సంస్థల సమిష్టి కృషి ద్వారా ఏప్రిల్ 2023 నుండి డిసెంబర్ 2025 మధ్య భారతదేశవ్యాప్తంగా 1,22,516 మంది పిల్లలను మానవ అక్రమ రవాణా నుండి రక్షించడం జరిగిందన్నారు. ఇది సమన్వయంతో కూడిన న్యాయపరమైన చర్యలు, సమాజ ఆధారిత జోక్యాల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. ఈ సంప్రదింపుల సమావేశాన్ని ప్రారంభిస్తూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ మాట్లాడుతూ బాలల రక్షణ అనేది దేశం ఎదుర్కొంటున్న అత్యంత సవాలుతో కూడిన బాధ్యతలలో ఒకటని అభివర్ణించారు. దోపిడీల నుండి పిల్లలను రక్షించడంలో పౌర సమాజ సంస్థలు చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఒక్క బిడ్డ ప్రాణాన్ని కాపాడటం కూడా అత్యంత గొప్ప కార్యాలలో ఒకటి. ఎంతో మంది బాలికలు మానవ అక్రమ రవాణాకు బలి అవుతూ తిరిగి ఇంటికి చేరుకోలేకపోతున్నారు. ఈ పిల్లలు తమను ఎవరో ఒకరు రక్షిస్తారని ఎదురుచూస్తుంటారు. వారిని లైంగిక దోపిడీ నుంచి కాపాడే పౌర సమాజ సంస్థల స్వచ్ఛంద కార్యకర్తలు దేవదూతలతో సమానమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా డా.ఆలూరి కామేశ్వరి సాధనా సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలోని పిల్లలకు ఎదురయ్యే అత్యంత తీవ్రమైన ముప్పులలో బాలల అక్రమ రవాణా ఒకటిగా కొనసాగుతోందని అన్నారు. “సగటున ప్రతిరోజూ ఆరుగురు పిల్లలు అక్రమ రవాణాకు గురవుతుండగా ఐదుగురు పిల్లలను బలవంతపు చాకిరీలోకి నెడుతున్నారనేది ఒక విషాద వాస్తవమన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి గంటకు 11 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారన్నారు. వారిలో గణనీయమైన సంఖ్యలో అక్రమ రవాణా బాధితులుగా మారుతున్నారు. ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థీకృత నేరం మానవ అక్రమ రవాణా, మహిళలు, పిల్లలే దీనికి ప్రధాన లక్ష్యాలుగా ఉంటున్నారు. అక్రమ రవాణాదారులు వాణిజ్య లైంగిక దోపిడీ వెట్టిచాకిరి ద్వారా లాభాలు పొందుతున్నారు. అసంఘటిత రంగంలోని బాల కార్మిక వ్యవస్థ అక్రమ రవాణా యొక్క అత్యంత దారుణమైన రూపాలలో ఒకటన్నారు.