నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల రావడానికి తన వంతు కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. గతంలో ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు పలుమార్లు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. లేఖ నంబర్ 06/2024 (తేది: 30-09-2024) ద్వారా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, 06/32-2/2025 (తేది: 24-02-2025) ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, 06-01/2025 (తేది: 21-04-2025) ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, 38/2025 (తేది: 27-05-2025) ద్వారా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. మార్చి 24వ తేది 2024న అసెంబ్లీ సమావేశాల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ కళాశాల అవసరం ఉందని సభాముఖంగా ముఖ్యమంత్రి కి విన్నవించామని ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతి రెడ్డి తెలిపారు. నిజామాబాద్ వ్యవసాయ ఆధారిత జిల్లా కావడంతో ఈ కళాశాల రైతు యువతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఈ నిర్ణయం నిజామాబాద్ ప్రజల ఆశలను నెరవేర్చిందని పేర్కొన్నారు. అగ్రికల్చర్ కళాశాల కేటాయింపుతో రూరల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.