. . . సంస్థ విస్తరణపై జాతీయ, రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయాలు
హైదరాబాద్, బతుకమ్మ :
సమాచార హక్కు చట్టం – 2005 సమర్థవంతమైన అమలు, సంస్థ విస్తరణ, ప్రజల్లో అవగాహన పెంపు, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం చేసే లక్ష్యాలతో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యం వహించారు. సమావేశంలో సమాచార హక్కు చట్టం అమలులో ఎదురవుతున్న సవాళ్లు, సంస్థ భవిష్యత్తు కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా సంస్థను గ్రామస్థాయి వరకు విస్తరించడం, ప్రజలకు ఉచిత అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, న్యాయ, సాంకేతిక మార్గదర్శక సేవలను అందించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేసే సలహా, పర్యవేక్షణ, అధ్యయన, ఇతర కమిటీలలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను కోరుతూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించి, సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ డా. చంటి ముదిరాజ్ మాట్లాడుతూ, “సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన సాధనం. ప్రభుత్వం, సమాచార కమిషన్, ప్రజా సంఘాలు పరస్పర సహకారంతో పనిచేస్తేనే చట్టం లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరతాయి. ప్రజలకు సమాచారం వేగంగా, పారదర్శకంగా అందే విధంగా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావాలి” అని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రతి గ్రామానికి సమాచార హక్కు ఉద్యమాన్ని విస్తరించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్, జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్, రాష్ట్ర కో-కన్వీనర్ గడప కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్, అరవింద్ స్వామి, రాష్ట్ర కార్యదర్శులు రావుల నవీన్ కుమార్, కేడెల ప్రసాద్, మడుపు వేణుగోపాల్ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఏ. శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ గౌడ్, అశోక్ కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గుడ్డేటి ప్రవీణ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము అశోక్, నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు మంద సాయిబాబు తదితర జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం అమలును మరింత బలోపేతం చేయాలంటే ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్, అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజా సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సమావేశం విజ్ఞప్తి చేసింది.