జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమతి లేకుండా ఆటోలు నిలుపుదల చేస్తున్న ఘటనలపై ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్టాండ్ ప్రాంగణంలో ఎటువంటి అనుమతి లేకుండా ఆటోలు నిలబడరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికుల వివరాల ప్రకారం, బస్టాండ్‌లో ఆటోలు నిలుపుదల చేయడం వల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో బస్సులు బస్టాండ్‌లోకి ప్రవేశించే సమయంలో ఆటోలు అడ్డుగా నిలవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వారు తెలిపారు. అలాగే, ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా నడుస్తున్న సమయంలో ప్రైవేటు వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లిపోతున్నాయని, దీనివల్ల ఆర్టీసీ ఆదాయానికి నష్టం కలుగుతోందని స్థానికులు పేర్కొన్నారు. ముఖ్యంగా బాన్సువాడ డిపో, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులు సమయపాలన పాటిస్తూ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల కార్యకలాపాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ ఆదాయం పరిరక్షణ దృష్ట్యా బస్టాండ్‌లో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
