Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 7:40 pm Posted by : ramakrishna

ఆర్టీసీ బస్సు – ద్విచక్ర వాహనం ఢీ

 

. . . యువకుడు మృతి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రం శివారులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆలూరు నుంచి దేగాం–నందిపేట్ రహదారి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు, నందిపేట్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొన్నాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై యాసీర్ అర్ఫాత్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, ప్రమాద సమయంలో తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు అతడి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు, అతడి గుర్తింపును నిర్ధారించేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.