Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 8:27 pm Posted by : ramakrishna

జీపిలో రూ. 6 లక్షల నిధులు దుర్వినియోగం…

 

. . . జీపీ సెక్రటరీ పై పిర్యాదు చేసిన పాలకవర్గం

 

. . . సెక్రటరీ పై చర్యలేవి ?

 

. . . పట్టించుకోని అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

గ్రామపంచాయితీ సర్పంచ్ ల పదవీకాలం పూర్తికావడంతో ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో 2024, మార్చిలో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో పనులు నిర్వహాణకు వాటికి అయ్యే ఖర్చులు, గ్రామపంచాయతీకి వచ్చే లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో కొనసాగాలి. కానీ నిబంధనలకు విరుద్దంగా నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ మండలంలోని అంబం గ్రామపంచాయితీలో సెక్రటరీ శ్రావణ్ నిర్లక్ష్యంగా వ్యహారిస్తు సుమారుగా రూ. 6 లక్షల నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రోజువారిగా వసూలు చేసిన ఇల్లు ట్యాక్సులు, నల్ల బిల్లులకు సంబంధించిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమచేయాల్సి ఉండగా,  ఆ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమచేయలేదు. తీరా గ్రామపంచాయతీకి  నియమించిన స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకుపోలేదని ఆయనకు తెలియకుండా డబ్బులను ఎలా ఖర్చు చేస్తారని పలువురు చర్చించుకుంటున్నారు.

 

Rs. 6 lakhs of funds misused in GP...

 

ఇదిలా ఉండగా గ్రామంలో గత స్పెషల్ ఆఫీసర్ పాలనలో జమచేసిన నిధులను రోజువారిగా బ్యాంకులో జమ చేయకుండా తమ ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేసినట్లు  నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయితీ పాలకవర్గం సభ్యులు గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రావణ్ పై ఎంపీడీఓ బాలగంగాధర్ కు గత నెల క్రితం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నప్పటికి ఉన్నతాధికారులు విచారణ చేపట్టక పోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందని సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఎంపీడీఓకు, ఎంపీఓకు విన్నవించినా తమగోడు ఎవరికి పట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గ్రామంలో వీథిదీపాలు, పారిశుద్ద్య నిర్వాహణ, కార్యక్రమాల పట్ల సెక్రటరీ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని, ఆయన ఎప్పుడొస్తాడో కూడా ఎవరికి తెలియదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పంచాయితీ సెక్రటరీ సకాలంలో విధులకు రావడం లేదని, ఫోన్ చేస్తే గాని ఫోన్ లిఫ్ట్ చేయడని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ఈ సెక్రటరీ తమకు వద్దని పాలకవర్గం సభ్యులు  డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ బాలగంగాధర్ కు వివరణ కోరగా, సెక్రటరీపై  పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాద్యులపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై బోధన్ డివిజన్ డీఎల్పీఓకు కూడా సమాచారం ఇచ్చామని ఎంపీడీఓ తెలిపారు.