Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 7:41 pm Posted by : ramakrishna

న్యూడ్ కాల్ చేస్తే  రూ.5వేలు

  • గెస్ట్ హౌజ్ కు వస్తే రూ.10వేలు
  • వివాహితకు డెంటల్ డాక్టర్, రియాల్టర్ వేధింపులు
  • కేసు నమోదు చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పడే స్వాతంత్ర్యం వచ్చినట్లని జాతిపిత మహత్మ గాంధీ అన్నారు. ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో, చదువు కోసమో బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండాపోతుంది. వారిపై పని చేసే చోటనే వేదింపులు అధికమయ్యాయి. సమాజంలో మహిళలు బయటకు వెళ్లి పని చేస్తేనే కుటుంబంతో పాటు తెలిసిన వారే చులకనగా చూసే సమయంలో ఆడవారు పని చేసే చోట జరుగుతున్న వేదింపులపై ఎవరికి చెప్పుకోలేక వారి దాష్టికాలకు బలవుతున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన వివాహితను ఇద్దరు ప్రబుద్దులు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వాట్సప్ కాల్ చేయాలని, న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్న వ్యవహారం ఫిర్యాదులతో వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువతి తన వివాహానికి ముందు ట్రావెల్ కార్యాలయంలో రిసెప్షనిస్టుగా పని చేసేది. ఏడాది క్రితం వివాహం జరుగగా భర్త కోరిక మేరకు ప్రైవేట్ జాబ్ ను వదులుకుని ఇంటి వద్దే ఉంటుంది. తాను ట్రావెల్ ఏజంట్ కార్యాలయంలో పని చేసే చోట యజమాని భామ్మర్థి శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని యువతితో మాటలు కలిపాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అప్పట్లో వెకిలి చేష్టలు చేసేవాడు. ఎక్కడ ఈ విషయం చెబితే యజమాని తన ఉద్యోగం తీసేస్తాడేమోనని, ఇంట్లో చెబితే ఉద్యోగం మానేయాలని కుటుంబ సభ్యులు చెబుతారేమోనని యువతి భయపడి అంతర్గతంగానే కుమిలిపోయింది. అదే సమయంలో నగరంలో డాక్టర్ల కాలనీగా పేరున్న ఖలీల్ వాడికి చెందిన డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్న మరో వ్యక్తి టూరిస్టు వీసా కోసం ట్రావెల్ కార్యాలయంకు వచ్చి యువతి నంబర్ తీసుకున్నాడు. అతను కూడా యువతిని తరుచుగా వేదించడం ప్రారంభించాడు. ఒక వైపు రియాల్టర్, మరో వైపు డెంటల్ డాక్టర్ వేదింపులు భరించలేక ఏడాది క్రితం ఉద్యోగం మానేసి వివాహం చేసుకుంది.

ఇటీవల కాలంలో పెళ్లయిన వివాహితకు రియల్ ఎస్టేట్ వ్యాపారి, దంత వైద్యుడి వేదింపులు ఎక్కువయ్యాయి. న్యూడ్ కాల్ చేస్తే రూ.5 వేలు ఇస్తామని, గెస్ట్ హౌజ్ కు వస్తే రూ.10 వేలు ఇస్తామని వాట్సాప్ కాల్, వీడియో కాల్స్ చేసి వేదించడం మొదలుపెట్టారు. నగరంలోని స్టార్ హోటల్ ను బుక్ చేసామని రావాలని కోరుతూ కాల్స్ చేసి వేదింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పోలీసు ప్రజావాణి సందర్భంగా సదరు వివాహిత పోలీసు కమిషనర్ కు తన గోడును వెళ్లబోసుకుంది. స్వయంగా పరిశీలించిన పోలీసు కమిషనర్ ఉన్నఫళంగా కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వోను ఆదేశించినట్లు తెలిసింది.