Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 11:02 pm Posted by : ramakrishna

ఇంటి నంబర్ కు రూ.20 లక్షలా..?

  • లక్షలు కురిపించిన డోర్ నంబర్
  • ఆర్మూర్ లో బల్ధియా రెవెన్యూ అధికారుల బాగోతం
  • ఏసీబీ దాడిలో కమిషనర్ పట్టుబడడంతో జోరుగా చర్చ

 

నిజామాబాద్, బతుకమ్మ : కమర్షియల్ ఏరియాలో అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణాలు రెవెన్యూ అధికారులకు కాసులు కురిపించాయి. ప్రధానంగా వాణిజ్య సముదాయాలు, అసైన్డ్ భూముల్లో, నాలా కన్వెన్షన్ లేని ఓపెన్ ప్లాట్ లలో కట్టిన భవనాల యజమానుల నుంచి లక్షలు వసూల్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఇంటి నంబర్ కే రూ.20 లక్షల వరకు వసూల్ చేశారంటే అతిశయోక్తి కాదు. ప్రధానంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో, చౌరస్తాలలో, బల్ధియాలో విలీనమైన గ్రామాల పరిధిలో భవనాలకు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా ఇంటి నంబర్ అవసరమైంది. దానిని సొమ్ము చేసుకుంటూ బల్ధియా అధికారులు ఇంటి నంబర్ కే లక్ష మొదలుకుని 20 లక్షల వరకు వసూల్ చేయడం విశేషం. ఇది ఎక్కడో మెట్రోపాలిట నగరాల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ అధికారుల అవినీతిలో చిన్న మచ్చతునక మాత్రమే.

ఏసీబీ అధికారులు ఈ నెల 27న ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా కమిషనర్ రాజు తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.  ఈ సందర్భంగా ఏసీబీ అధికారులను చూసిన డ్రైవర్ డబ్బుల బ్యాగ్ ను కిటికి ద్వారా బయటకు విసిరేయగా దానిని తెరిచి చూసి షాక్ కు గురయ్యారు. అందులో 4.30 లక్షల నగదు ఉండడం విశేషం. మున్సిపాలిటీలో కమిషనర్ ఒక్క రోజు వసూళ్లే 4.30 లక్షలు ఉండడంతో ఎంత మేరకు వసూళ్ళ కార్యక్రమం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. దశాబ్ధం క్రితం బల్ధియాగా రూపాంతరం చెందిన ఆర్మూర్ మున్సిపాలిటీ అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువు అని చెప్పాలి. పాలకవర్గం ఉన్నప్పుడు లీడర్లు, పాలకవర్గాలు లేనప్పుడు అధికారులు ప్రజలను అందిన కాడికి దండుకున్నారని చెప్పాలి. నిజామాబాద్ బల్ధియాలో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండగా ఏకంగా కమిషనరే లంచం తీసుకుంటూ దొరకడం గమనార్హం.

ఆర్మూర్ ఇటీవల కాలంలో దినదినంగా డెవలప్ అవుతుంది. ఆర్మూర్ మీదుగా జాతీయ రహదారి 44 ఉండడం, గ్రీన్ ఫిల్డ్ జాతీయ రహదారి 63 వెళ్తుంది. అంతేగాకుండా మామిడిపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పట్టణ విస్తరణ వేగంగా పుంజుకుంది. అదే సమయంలో బల్ధియాలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ ప్లాట్ల దందా జరుగుతుంది. అక్రమ నిర్మాణాలకు నిజాంసాగర్ కాలువ కబ్జాతో పాటు చెరువు శిఖం భూముల్లోనూ అక్రమ నిర్మాణాలు వెలిసాయి. దానికితోడు అసైన్డ్ భూముల్లోనూ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దానిని సొమ్ము చేసుకుంటూ బల్ధియా అధికారులు ఇంటి నంబర్  కే రూ.50 వేలు మొదలుకుని రూ.20 లక్షల వరకు వసూల్ చేశారని చోటామోటా లీడర్లే బహిరంగం చెబుతున్నారు. కేవలం కమిషనర్ వసూళ్లే లక్షల్లో ఉన్నాయని మిగిలిన ఉద్యోగుల వసూళ్ళు ఏ మేరకు ఉంటాయోనన్న చర్చ జరుగుతుంది. కమిషనర్ తన వద్ద ఉన్న సంతకం (డీజిటల్ సైన్) బూచిగా చూపి వసూళ్ళు దండిగా చేశాడని మున్సిపాలిటీలో జోరుగా వినిపిస్తున్నాయి. బల్ధియాలో వసూళ్ళపై గతంలో ఆరోపణలు వచ్చిన అప్పటి పాలకులు వారి వసూళ్ళకు బ్రేక్ పడుతుందని అధికారులను ముందు ఉంచి వసూళ్ళను చేశారన్న విమర్శలున్నాయి. బల్ధియాలో కేవలం సెల్ప్ అసిస్ మెంట్ (ఇంటిపన్ను) చెల్లింపు ద్వారా జరిగే ఇంటి నంబర్ కేటాయింపునకు రిజిస్ట్రేషన్లు జోరుగా జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఎల్ఆర్ఎస్ పై సడలింపులు ఇచ్చిన తర్వాత కూడా వసూళ్ళు ఆగలేదని, కమిషనర్ ఏసీబీకి చిక్కడమే అందుకు పరాకాష్టగా చెబుతున్నారు.