. . . నిర్మల్ జిల్లాలో ఇందూర్ వాసి చీటింగ్
. . . సిఎంఆర్ విదేశాలకు రెక్కలు
నిజామాబాద్, బతుకమ్మ:
గత కొన్నేళ్లుగా వివాదాస్పద భూములను చేజిక్కించుకొని రియల్టర్ గా చలామణి అయిన ఓ మాజీ రౌడీ షీటర్ రైస్ మిల్లర్ అవతారం ఎత్తాడు. నిజామాబాద్ నగరానికి చెందిన ఆ వ్యక్తి పక్కా స్కెచ్ వేసి నిర్మల్ జిల్లాపై కన్నేసాడు. ముధోల్ సమీపంలో రేకుల షెడ్డుతో రైస్ మిల్లును నిర్మించి పాడైన మిల్లు యంత్రాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి 2024-25 సంవత్సరం నుంచి రైస్ మిల్లర్ గా చలామణిలోకి వచ్చాడు. ఇంకేముంది,ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అధికారులను బురిడీ కొట్టించి 2024-25 సం. లో 72 ఏసీకే ల సన్న రకం, దొడ్డు రకం దాన్యం కస్టమ్స్ మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం నుంచి పొందాడు. రైస్ మిల్లును ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్క బస్తా ధాన్యం నూర్పిడి చేయలేదు. ఈ మిల్లు ఆవరణలో కనీసం ఊక ఆనవాళ్లు లేకపోవడం గమనార్హం. ఆలస్యంగా మేల్కొన్న సివిల్ సప్లై అధికారులు అక్టోబర్, 2026లో ఆ మిల్లును పరిశీలించగా, అక్రమ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి దాన్యం ధరల ప్రకారం కస్టమ్ మిల్లింగ్ కోసం ప్రభుత్వం కేటాయించిన 5 కోట్ల విలువచేసే 72 ఏసీకే ల దాన్యం మాయం అవడంతో అధికారులు, ఆ మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ముందస్తుగా గ్రహించిన ఆ రౌడీ మిల్లర్ వెంటనే కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. ఆ సమయంలో మార్కెట్లో బియ్యం ధరల ప్రకారం ప్రభుత్వ ధాన్యం విలువ సుమారు 15 కోట్లకు పైగా ఉంటుందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ మిల్లర్ మొక్కుబడిగా కొంత ధాన్యం ప్రభుత్వానికి అప్పగించి మిగిలిన ధాన్యం తిరిగి ఇచ్చేందుకు కొంత సమయం కావాలని అధికారులను నమ్మించారు. ఈ అభ్యర్థన మేరకు అధికారులు కొంత సమయం ఇచ్చారు. సుమారు సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఆ మిల్లర్ స్పందించకుండా మొండికేసారు. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చితే ఈ ధాన్యం విలువ సుమారు రూ. 20 కోట్లకు చేరుకుంటుంది. కొందరు అధికారులు, ఆ అక్రమార్కునితో కలిసి పోవడంతో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
. . . రూ.15 కోట్లతో పెట్టుబడులు
ప్రభుత్వ కన్నుగప్పి సిఎంఆర్ ధాన్యాన్ని దుబాయ్, సౌదీ దేశాలకు తరలించిన ఆ మిల్లు యజమాని సుమారు రూ. 15 కోట్లకు పైగా సంపాదించినట్లు సమాచారం. గతంలో విదేశాల్లో బియ్యం దందా చేసిన అనుభవం ఉండడంతో సునాయసంగా సిఎంఆర్ ధాన్యాన్ని విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమంగా సంపాదించిన రూ. 15 కోట్ల సొమ్మును ఆ మిల్లర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ డాబు దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు. గణపతి దేవుని పేరుతో రైస్ మిల్లును ఏర్పాటు చేసిన ఆ మాజీ రౌడీషీటర్ మిల్లర్ అవతారమెత్తి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ఆయనపై గతంలో నిజామాబాద్ లో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయగా రాజకీయ పలుకుబడితో ఆ రౌడీ షీట్ ను తొలగించేసుకున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య వివాదాలు ఉన్న భూములను గుర్తిస్తూ అతి తక్కువ ధరలకు విలువైన స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. మాధవనగర్ నుంచి కలెక్టరేట్ వెళ్లే బైపాస్ రోడ్డు చౌరస్తా సమీపంలో గల పెట్రోల్ బంక్ పక్కన సుమారు 1000 గజాల స్థలం, కెసిఆర్ కాలనీ సమీపంలో ఇదే బైపాస్ రోడ్డులో సుమారు 500 గజాల స్థలంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆయన కుటుంబీకుల పేరిట ఇంటి స్థలాలు కొనుగోలు చేశారు. ఇటీవల కొంతకాలంగా పోలీసు,సివిల్ సప్లై శాఖల అధికారులు రైస్ మిల్లర్లపై కొరడా జులిపిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఇంత పెద్ద మొత్తంలో గండి కొట్టిన దుబాయ్ శీను వ్యవహారంలో అధికార యంత్రాంగం మౌనముద్ర వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత రెండేళ్లుగా ఈ అక్రమ దందా వ్యవహారం ముగియని కథగా మారిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.
